ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌గా ఆచార్య: రాజశేఖర్
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 16వ రిజిస్ట్రార్‌గా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యుడు పి.రాజశేఖర్ నియమితులయ్యారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.వియన్నారావు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఏఎన్ యూ పాలక మండలి సమావేశంలో యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణకు సంబంధించిన పలు కీలక నియామకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి సమావేశం వివరాలను ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సి.రాంబాబు విలేకర్లకు వెల్లడించారు. రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం యూజీ పరీక్షల కో- ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీకి ఇప్పటి వరకు 24 మంది రిజిస్ట్రార్లుగా పనిచేసినప్పటికీ వారిలో 9 మంది ఇన్చార్జి హోదాలో బాధ్యతలు నిర్వహించారు. దీంతో పూర్తికాలపు రిజిస్ట్రార్‌గా నియమితులైన వారిలో ఈయన 16వ రిజిస్ట్రార్.
ఆచార్య జడ్.విష్ణువ ర్ధన్ పదవీ విరమణతో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన ఖాళీ అయిన ఓఎసీడీ పోస్టును కూడా భర్తీ చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా ప్రస్తుతం ఏఎన్‌యూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆచార్య ఎ.వి.ఎ.దత్తాత్రేయరావును నియమించారు. సైన్స్ కళాశాలకు ఇప్పటి వరకు వైస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఆచార్య సి.రాంబాబును ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల బుద్దిజం విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఎల్.ఉదయ్‌కుమార్‌ను యూజీ పరీక్షల కోఆర్డినేటర్‌గా నియమించారు. రిజిస్ట్రార్, ఓఎస్డీ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల కోఆర్డినేటర్ పోస్టుల నూతన నియామకాలు 2014 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. వీటితో పాటు ఈనెల 28వ తేదీన జరిగే ఏఎన్‌యూ 33, 34వ స్నాతకోత్సవాల్లో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చి డెరైక్టర్ ఎస్.మహేంద్రదేవ్‌కు ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్‌కు కూడా ఆమోదం తెలిపింది.