అస్తిత్వ ఉద్యమాలూ, పరిమితులూ
అభిప్రాయం
ప్రతి అస్తిత్వ ఉద్యమానికీ ఫలితాలూ, పరిమితులూ వుంటాయని సమాజ చలనం తెలియజేస్తూనే వుంటుంది. ఫలితాలు అంటే, ఆ ఉద్యమం సమాజం దృష్టికి తెచ్చిన కొత్త అంశాలు. పరిమితులు అంటే, ఆ ఉద్యమం లోపలా, బయటా వున్న పరిమితులు. లోపల వున్న పరిమితులు, ఉద్యమాన్ని అంతకు మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితిని కల్పిస్తాయి. దాంతో అది బయటి పరిమితి అవుతుంది. సమాజంలో కులాల మధ్యా, మతాల మధ్యా, జాతుల మధ్యా, స్త్రీ, పురుషుల మధ్యా అసమానతలున్నంతవరకూ అస్తిత్వ ఉద్యమాలు పుట్టుకొస్తూనే వుంటాయి. మరి, అన్ని అసమానతలూ అలా వుండగానే (ఇంకా పెరుగుతుండగా) అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎందుకొస్తున్నట్టు? ఆ ఉద్యమాల లోపల వున్న పరిమితే బయటి పరిమితికి కారణం అన్నాము. ఆ లోపలి పరిమితులేమిటి?
ఏ అస్తిత్వవాద లక్ష్యమైనా ఏముంటుంది? తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళడం. ఇందులో తప్పు పట్టవలసిందేమీ లేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్నే గుర్తించలేనివాళ్ళు ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏం గుర్తిస్తారు? అయితే, సమాజంలో అన్ని అసమానతలకూ మించిన అసమానత వున్నది. పేద, ధనికుల మధ్య వున్న తేడా! దీన్ని ఏ అస్తిత్వవాదమూ అంతగా పట్టించుకోదు. పేదలకూ ధనికులకూ మధ్య వున్న తేడా ఆర్థికపరమైనది. అస్తిత్వ ఉద్యమాలకు కారణం సామాజికమైనది. రెండింటినీ కలిపి చూడవచ్చా... అనవచ్చు. కలిసే వున్నప్పుడు కలిపి చూడక తప్పదు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతలకూ, ఆర్థిక పరమైన అసమానతలు సామాజిక అసమానతలకూ కారణాలవుతున్నాయి.
ఇందుకు స్త్రీ అస్తిత్వవాదం ఒక ఉదాహరణ. స్త్రీ చైతన్యవాదమన్నా, ఫెమినిజమన్నా అదే. చాలా న్యాయమైనది. అంత న్యాయమైన ఉద్యమం కూడా కొంతవరకూ కదిలి కదిలించి ఆగింది. సాహిత్యంలోనూ అది తీసుకొచ్చిన సంచలనం ఆగి, కొంత స్తబ్దతకు గురయింది. ఇంకేం చెయ్యాలో తెలీని కొందరు పురాణ పాత్రలకు స్త్రీవాద పాఠాలు చెబుతున్నారు. అయితే, స్త్రీలపై అన్ని రకాలుగా సాగుతున్న అణచివేతనూ, వివక్షనూ స్త్రీవాదం గట్టిగా ప్రశ్నించింది. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడంలో కొంత తప్పు ధోరణి కనిపించినా, అస్తిత్వ ఉద్యమాల ప్రారంభంలో వుండే అత్యుత్సాహంగా, ఆవేశంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆ స్త్రీ చైతన్యవాదం స్త్రీలనే కలుపుకోలేక పోయిందని అనక తప్పదు. దళిత కుటుంబాలకు చెందిన స్త్రీలు, ఎగువ మధ్య తరగతికీ, ఆపై వాళ్ళకూ చెందిన స్త్రీవాదంగా దాన్ని భావించారు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతకూ, ఆర్థిక పరమైన అసమానత సామాజిక పరమైన అసమానతకూ కారణాలవుతాయంటే ఇదే.
స్త్రీ అస్తిత్వవాదం కోరిందేమిటి? తమను మనుషులుగా గుర్తించాలని కాదు. స్త్రీలుగా గుర్తించాలనే. అందువల్ల, సహజంగానే వాళ్లు ఏ వర్గానికి చెందిన స్త్రీలో వాళ్ళ అస్తిత్వవాదంగానే అది వుండిపోయింది. ఒక్క స్త్రీ అస్తిత్వవాదమే కాదు, అన్ని అస్తిత్వవాదాల, లేదా ఉద్యమాల పద్ధతీ అదే. మైనారిటీ అస్తిత్వవాదం, తమను మైనారిటీలుగా గుర్తించాలనే కోరుతుంది. వివిధ కుల సంఘాలన్నీ తమను ఆ కులం వారుగా గుర్తించాలనే కోరుకుంటాయి. ఈ ఆలోచన స్త్రీల గురించి స్త్రీలే రాయాలనీ, ఫలానా కులం గురించి ఆ కులం వారే రాయాలనేంత విపరీత ధోరణికి వెళ్ళడము చూశాం. దాంతో ఏ అస్తిత్వ ఉద్యమానికీ మరొక అస్తిత్వ ఉద్యమం మద్దతు లభించదు. కొన్ని సందర్భాల్లో ఒకదానికి మరొకటి వ్యతిరేకం కూడా!
ఒక్కమాటలో చెప్పాలంటే, అస్తిత్వ ఉద్యమాల ఆలోచన తాము కోరుతున్న వాటిని సాధించడం మీద కన్నా, అస్తిత్వాన్ని కాపాడుకోవడం మీదనే ఎక్కువగా వుంటుందనాలి. ఆ పరిమితే ఆ ఉద్యమాలు సాధించినవాటికీ వర్తిస్తుంది.
- పి. రామకృష్ణ