వసతుల కల్పనకు కృషి
తణుకు : తణుకు పట్టణంలోని అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అవస్థలను తెలుసుకునేందుకు మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ పి.శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కాలనీలోని వీధుల్లో తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కమిషనర్ : ఇక్కడ ఇబ్బందులైమైనా ఉన్నాయా.
వెంకటరమణ: మంచినీటి సమస్య ఉంది సార్. బోరు వేసినప్పటికీ ఈ నీళ్లు తాగేందుకు పనికి రావడం లేదు. నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం.
కమిషనర్ : గోదావరి జలాలను తరలించే క్రమంలో పైప్లైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. పట్టణానికి ఈ ప్రాంతం చాలాదూరంగా ఉండటంతో విస్తరణకు కొన్నాళ్లు సమయం పడుతుంది.
వెంకటరమణ : ఇక్కడ దాదాపు 600 కుటుంబాల వారుంటున్నారు. రేషన్ డిపో ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం.
కమిషనర్ : ఈ విషయం ఎమ్మెల్యే దృష్టిలో ఉంది. త్వరలోనే పరిష్కారం లభిస్తుంది.
అక్కడి నుంచి మరో వీధిలోకి వెళ్లిన కమిషనర్ రమేష్ అనే వ్యక్తితో మాట్లాడారు.
రమేష్ : కరెంటు సమస్య ఉంది సార్. సామర్థ్యానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయాల్లో లైట్లు కాలిపోతున్నాయి.
కమిషనర్ : రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను.
దుర్గాప్రసాద్ : బైపాస్ రోడ్డు నుంచి కాలనీ వరకు వీధి దీపాలు లేవు. రాత్రి సమయాల్లో రావడానికి భయపడుతున్నాం.
కమిషనర్ : విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
అన్నపూర్ణ : ఇటీవల దోమల ఉధృతి పెరిగిపోవడంతో చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కమిషనర్ : దోమల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుంటాను.
రూ. 2 కోట్లతో పైప్‌లైన్ విస్తరణ
ఇందిరమ్మ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటాం. గోదావరి జ లాలు సరఫరా చేసేందుకు పైపులైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. ఇందులో భాగంగా ఇంది రమ్మ కాలనీకి గోదావరి జలాలు తరలించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. దూరం అయినప్పటికీ ఇక్కడకు కూడా పైపులైన్లు విస్తరించి గోదావరి జలాలు అందిస్తాం. కాలనీలో రూ.28 లక్షలతో బీటీ రోడ్లు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశాం. ప్రస్తుతం రూ.10 లక్షలు వెచ్చించి గ్రావెల్‌తో మెరక చేయిస్తున్నాం.
- పి.శ్రీకాంత్, ఇన్చార్జి కమిషనర్, తణుకు