హంద్రీ-నీవా నీటి కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి
► అనంతను కోనసీమగా చేసుకుందాం
► వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు : హంద్రీ-నీవా నీటితో అనంత జిల్లాను కోనసీమగా మార్చుకుందామని, ఇందు కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని , ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గాండ్లపర్తి, యర్రగుంట, బొగినేపల్లి గ్రామాల్లో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ‘హంద్రీ-నీవా ఆయకట్టు చైతన్యయాత్ర’ను నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవాను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా మన చెరువులకు నీరు చేరిందంటే అది దివంగత నేత వైఎస్ చాలువేనన్నారు.
హంద్రీనీవా ద్వారా 23 టీఎంసీల నీటితో జిల్లాను సస్యశ్యామం చేసుకోవచ్చని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవో 22 విడుదల చేసి హంద్రీనీవా డిజైన్‌ను మార్చి, జిల్లాలో ఆయకట్ల (డిస్టిబ్యూటర్స్)ను తొలగించారన్నారు. వైఎస్ఆర్ ప్రతి రైతు భూమి తడవాలనే ఉద్ధేశంలో పిల్ల, పంట కాలువను ఏర్పాటు చేస్తే, బాబు ప్రత్యేక జీవో ద్వారా వాటిని తొలగించారన్నారు. బాబు రాగానే చాలా ప్యాకేజీలను రద్దు చేశారన్నారు. మంత్రి పరిటాల సునీత లేఖ రాయడంతోనే హంద్రీనీవా పాత కాంట్రాక్టర్లను ప్రభుత్వం రద్దు చేసి, కొత్త కాంట్రాక్టర్లు సీఎం.రమేష్, సురేంద్రచౌదరిలకు దాదాపుగా రూ.
200 కోట్లు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేశారని ఆరోపించారు. మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి రూ. 12 లక్షలు ఇస్తూ, ఏకంగా ఆ గ్రామం మీదే రూ. 12 కోట్లు మంత్రి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా ఆయకట్టు సాధనకు ఈ నెల 20వ తేదిన రాప్తాడులో భారీ బహిరంగ ఏర్పాటు చేశామనీ, ఆ సభకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, మండల కన్వీనరు బోయ రామాంజినేయులు, నాయకులు రాము, శేఖర్, బీరన్న, బాలకృష్ణారెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, గాండ్లపర్తి నాయుడు, శివయ్య, యర్రగుంట కేశరెడ్డి, సర్పంచు నారాయణమ్మ, వెంకటేష్, పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు నాగరాజు, నరేంద్ర చలపతి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.