నిధులివ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం
- పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బేతంచెర్ల: ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోతే నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేయాలని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ గ్రౌండులో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని సంస్కరణలు తెస్తే వాటిని ప్రస్తుత పాలక ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. అప్పులు చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలచి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ఉత్సవ విగ్రహాల్లాగా ప్రజల్లో తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కనీసం అధికారులైనా పేదల సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు. గతంలో డోన్ ఎమ్మెల్యేగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కందకంపై కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి నాలుగేళ్లలవుతున్నా ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదని సీపీఎం నాయకులు బుగ్గన దృష్టికి తెచ్చారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంజనాదేవి, నోడల్ అధికారి సతీష్, ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, మండల సహకార సంఘం అధ్యక్షుడు బుగ్గన నాగభూషణంరెడ్డి, వైస్ ఎంపీపీ మునేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ బొద్దుల రోజమ్మ, ఉపసర్పంచ్ వై రామేశ్వరమ్మ ఎంపీటీసీ సభ్యులు సుమతి, నాగజ్యోతి, జాకిరుల్లా బేగ్ పాల్గొన్నారు.