నన్ను ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ప్రయత్నం
దేవినేని ఉమాపై పీఏసీ చైర్మన్ బుగ్గన ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టేందుకు అధికార టీడీపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగా భూసేకరణ చట్టం నిబంధనలు సైతం పాటించకుండానే నా సొంత భూములను తీసుకోవడానికి యత్నించింది. ఈ ప్రయత్నాలకు కోర్టు ద్వారా అభ్యంతరం తెలిపితే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని నాపై మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుపట్టారు.
మంత్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నానని ఆరోపణలు చేస్తున్న మంత్రి ఉమా ఆయన ఇంటిలో ఆరడుగుల స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం ఒకవేళ మున్సిపాలిటీవారు నిబంధనలు పాటించకుండా తీసుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారా? లేదంటే మౌనంగా ఉంటారా? అన్నది తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చెరువుపల్లికి సంబంధించి మంత్రి దేవినేని ఉమా చెబుతున్న తొమ్మిదెకరాల భూములకు 1929 నుంచి దస్తావేజులున్నాయని చెప్పారు. అయితే తమకెలాంటి నోటీసులివ్వకుండా.. ప్రతిపక్షంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రెవెన్యూ, పోలీసు, సాగునీటి శాఖల అధికారులతో బలవంతంగా భూముల స్వాధీనానికి ప్రయత్నించిందన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు.
అశోక్‌రెడ్డి, పోతులపై అసెంబ్లీ కార్యదర్శికి బుగ్గన ఫిర్యాదు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. పీఏసీ చైర్మన్, పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.