బాబోయ్... ఫుట్‌బాల్ వద్దు
నెహ్రాకు గాయాల భయం
న్యూఢిల్లీ: భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో చాలా కాలంగా ఫుట్‌బాల్ అంతర్భాగంగా మారిపోయింది. మన ఆటగాళ్లు నెట్స్‌లోకి వెళ్లే ముందు వార్మప్ కోసం రెండు జట్లుగా విడిపోయి ఫుట్‌బాల్ ఆడటం రొటీన్. అయితే పేసర్ నెహ్రా మాత్రం ఇప్పుడు ఫుట్‌బాల్ పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నాడు. ‘ఒకప్పుడు నేనూ ఫుట్‌బాల్ ఆడేవాడిని. కానీ ప్రస్తుత స్థితిలో ఎలాంటి సాహసాలు చేయదల్చుకోలేదు. నా కెరీర్లో చాలా సార్లు గాయాల పాలయ్యాను. కాబట్టి ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండదల్చుకున్నాను. అందుకే జట్టు ఫుట్‌బాల్ ఆడినా నేను ఆ వైపు వెళ్లదల్చుకోలేదు’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. గతంలో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడి జట్టుకు దూరమైన సందర్భాలున్నాయి.