108 అమ్మవారి ఆలయాల దర్శనం
ప్యారిస్ : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ తరపున 108 అమ్మవారి ఆలయాల సందర్శన, ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన, ఆడి నెల అమావాస్య సందర్శన వంటి మూడు విధాలైన పర్యాటక ఆలయాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడాదిలో ఆడి నెల అమ్మవారికి ప్రీతి పాత్రమైనది. ఆ నెలంతా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటా రు. ఈ సందర్భంగా 108 అమ్మవారి ఆలయాల సందర్శన ప్యాకేజీ టూర్ ఆడి నెలలో ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం ఆరు గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాష్ట్రం లో ఉన్న ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలను సందర్శించి ఐదు రోజుల తర్వాత తిరిగి చెన్నైకు చేరుతారు.
ఆ రోజుల్లో వైదీశ్వరన్ ఆలయం, తంజావూరు, మదురై, తిరుచ్చి వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస ఏర్పాట్లు చేశారు. ఈ ప్యాకేజీ చార్జీగా ఒక వ్యక్తి రూ.4,950 (ఇద్దరు బస చేసే విధంగా గది లభ్యమవుతుంది), చిన్నారులకు రూ.4,350 (4 నుంచి 10 వయసు లోపు), ఒంటరి వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యంతో*5,950 చార్జీగా వసూలు చేస్తారు. ఈ చార్జీ వాహన రాకపోకలకు, బసకు మాత్రమే అని నిర్వాహకులు వెల్లడించారు.
ఒక రోజు శక్తి టెంపుల్ టూర్
ఒక రోజు శక్తి ఆలయాల సందర్శన ప్యాకేజీ కింద మాంగా డు, తిరువేర్కాడు, పూందమల్లి, తిరుముల్లైవాయల్, సెంబులివరం, పంజట్టి, మేలూర్, తిరువొత్తియూర్ వంటి చెన్నై నగర, శివారు ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ఒక వ్యక్తికి సాధారణ బస్సు చార్జీగా రూ.470, ఏసీ బస్సు సౌకర్యంతో రూ.550గా నిర్ణయించారు.
ఆడి అమావాస్య ప్యాకేజీ
అమావాస్యలన్నింటిలో ఆడిలో వచ్చే అమావాస్యకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు పూర్వీకులకు పిండాలు పెట్టి తర్పణాలు అర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి, వారి వంశస్తులకు మంచి చేకూరుతుందని హైందవుల అపార నమ్మకం. మూడు రోజులు ఆడి అమావాస్య ప్యాకేజీ టూర్ చెన్నై నుంచి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, తిరుభువనం, దేవిపట్నం, రామర్ పాదం, అనుమాన్ పాదం, రామేశ్వరంలోని అగ్ని తీర్థాలను సందర్శించి 27వ తేదీ ఉదయం చెన్నైకు చేరుకుంటుంది. వివరాలకు పర్యాటక శాఖ అధికారి, తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ, వాలాజా రోడ్డు చిరునామాలో కానీ లేక 044 - 25384444, 25383333 నంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.