PACL
-
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
రూ.67,228 కోట్లు ఇక రానట్టే!.. వసూలు కావడం కష్టమేనన్న సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, తనకు రావాల్సిన బకాయిలు రూ.96,609 కోట్లలో రెండొంతులు అయిన రూ.67,228 కోట్లను (2022 మార్చి నాటికి) ఇక ‘వసూళ్లు కావడం కష్టమే’ అనే విభాగం కింద చేర్చింది. వివిధ కంపెనీలపై విధించిన జరిమానాలు చెల్లించకపోవడం, ఫీజుల చెల్లింపుల్లో వైఫల్యం, తన ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవవడం వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం బకాయిల్లో రూ.63,206 కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పీఏసీఎల్, సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించినవి కావడం గమనార్హం. అలాగే, మొత్తం వసూలు కావాల్సిన బకాయిల్లో 70 శాతానికి సమానమైన రూ.68,109 కోట్లు వివిధ కోర్టులు, కోర్టులు నియమించిన కమిటీల విచారణ పరిధిలో ఉన్నట్టు 2021–22 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. అన్ని మార్గాల్లో ప్రయత్నించినా కానీ, రూ.67,228 కోట్లు వసూలయ్యే అవకాశాల్లేవని సెబీ తేల్చింది. -
ఇన్వెస్టర్ల రిఫండ్స్‌కు సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పీఏసీఎల్ అక్రమ పథకాల అంశంలో ఇన్వెస్టర్లకు రిఫండ్స్‌ను అందించే చర్యలు ప్రారంభించింది. ఇందుకు జూన్ 30లోగా అసలు పత్రాలను(ఒరిజనల్ సర్టిఫికెట్లు) దాఖలు చేయవలసి ఉంటుందని ఇన్వెస్టర్లకు తెలియజేసింది. మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన సెబీ నియమించిన అత్యున్నత కమిటీ నుంచి ఎస్ఎంఎస్ అందుకున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ పథకమని సెబీ తెలియజేసింది. రూ. 10,001 మొదలు రూ. 15,000 వరకూ సొమ్మును ఆశిస్తున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ అవకాశమని స్పష్టం చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లను ఈ ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకూ అనుమతించనున్నట్లు వెల్లడించింది. పెరల్ గ్రూప్‌గా పేరున్న పీఏసీఎల్ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును వాపసు చేయమంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సెబీ నిధుల వాపస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే షురూ సెబీ ఏర్పాటు చేసిన కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడం ద్వారా ఇప్పటికే రిఫండులకు శ్రీకారం చుట్టింది. ఇన్వెస్టర్ల వివరాలను ధ్రువపరచుకున్నాక దశలవారీగా సొమ్మును వాపసు చేయనుంది. వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పెరల్ గ్రూప్ ప్రజల నుంచి నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కలెక్టివ్ పెట్టుబడి పథకాల(సీఐఎస్) ద్వారా పీఏసీఎల్ రూ. 60,000 కోట్లు సమీకరించినట్లు సెబీ గుర్తించింది. సొమ్ము వాపసును ఆశిస్తున్న ఇన్వెస్టర్లు ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయానికి ఒరిజనల్ పత్రాలను పంపించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల సొమ్ము రిఫండ్ చేయడంలో వైఫల్యంతో 2015 డిసెంబర్లో సెబీ పీఏసీఎల్ గ్రూప్‌సహా.. తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ను చేపట్టింది. -
పీఏసీఎల్ ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: పీఏసీఎల్‌కు చెందిన అన్ని ఆస్తులను, ఆ కంపెనీ తొమ్మిది మంది ప్రమోటర్లు, డెరైక్టర్ల ఆస్తులన్నింటినీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అటాచ్ చేసింది. పీఏసీఎల్ (ఇంతకుముందు పియర్ల్స్ ఆగ్రోటెక్ కార్పొ)ఇన్వెస్టర్లకు రూ.60,000 కోట్ల డిపాజిట్లను రిఫండ్ చేయడంలో విఫలమైనందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. దాదాపు 5 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి పీఏసీఎల్ సంస్థ రూ.49,100 కోట్ల డిపాజిట్లను సమీకరించిందని సెబీ పేర్కొంది. వాగ్దానం చేసిన రాబడులు, వడ్డీ చెల్లింపు, ఇతర చార్జీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.55,000 కోట్లకు మించిందని వివరించింది. అంతేకాకుండా పీఏసీఎల్ గ్రూపు అనుబంధ సంస్థ పీజీఎఫ్‌ఎల్ అక్రమంగా ఇన్వెస్టర్ల నుంచి రూ,5,000 కోట్లు సమీకరించిందని, ఈ డిపాజిట్లను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలమైందని సెబీ పేర్కొంది. పీఏసీఎల్ లిమిటెడ్, ఈ కంపెనీ ప్రమోటర్లు, డెరైక్టర్లు అయిన -తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రత భట్టాచార్య, నిర్మల్ సింగ్ భంగూ, టైగర్ జోగిందర్, గుర్నామ్ సింగ్, ఆనంద్ గుర్వాంత్ సింగ్, ఉప్పల్ దేవీందర్ కుమార్‌లకు వ్యతిరేకంగా సెబీ చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తాలను వడ్డీ, ఇతర చార్జీలను కలిపి చెల్లించాలని సెబీ 2014, ఆగస్టు 22న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అందిన మూడు నెలల్లలోగా అన్ని స్కీమ్‌లను మూసేయాలని, ఇన్వెస్టర్లకు డబ్బులు రీఫండ్ చేయాలని పేర్కొంది. ఇలా చేయడంలో విఫలమైనందుకు తాజాగా కంపెనీ, ప్రమోటర్ల, డెరైక్టర్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీళ్లకు చెందిన అన్ని బ్యాంక్, డిమ్యాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను తక్షణం అటాచ్ చేస్తామని సెబీ పేర్కొంది.