న్యూఢిల్లీ: పీఏసీఎల్‌కు చెందిన అన్ని ఆస్తులను, ఆ కంపెనీ తొమ్మిది మంది ప్రమోటర్లు, డెరైక్టర్ల ఆస్తులన్నింటినీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అటాచ్ చేసింది. పీఏసీఎల్ (ఇంతకుముందు పియర్ల్‌స్ ఆగ్రోటెక్ కార్పొ)ఇన్వెస్టర్లకు రూ.60,000 కోట్ల డిపాజిట్లను రిఫండ్ చేయడంలో విఫలమైనందుకు సెబీ ఈ చర్య తీసుకుంది.
దాదాపు 5 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి పీఏసీఎల్ సంస్థ రూ.49,100 కోట్ల డిపాజిట్లను సమీకరించిందని సెబీ పేర్కొంది. వాగ్దానం చేసిన రాబడులు, వడ్డీ చెల్లింపు, ఇతర చార్జీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.55,000 కోట్లకు మించిందని వివరించింది. అంతేకాకుండా పీఏసీఎల్ గ్రూపు అనుబంధ సంస్థ పీజీఎఫ్‌ఎల్ అక్రమంగా ఇన్వెస్టర్ల నుంచి రూ,5,000 కోట్లు సమీకరించిందని, ఈ డిపాజిట్లను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలమైందని సెబీ పేర్కొంది.
పీఏసీఎల్ లిమిటెడ్, ఈ కంపెనీ ప్రమోటర్లు, డెరైక్టర్లు అయిన -తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రత భట్టాచార్య, నిర్మల్ సింగ్ భంగూ, టైగర్ జోగిందర్, గుర్నామ్ సింగ్, ఆనంద్ గుర్వాంత్ సింగ్, ఉప్పల్ దేవీందర్ కుమార్‌లకు వ్యతిరేకంగా సెబీ చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తాలను వడ్డీ, ఇతర చార్జీలను కలిపి చెల్లించాలని సెబీ 2014, ఆగస్టు 22న ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు అందిన మూడు నెలల్లలోగా అన్ని స్కీమ్‌లను మూసేయాలని, ఇన్వెస్టర్లకు డబ్బులు రీఫండ్ చేయాలని పేర్కొంది. ఇలా చేయడంలో విఫలమైనందుకు తాజాగా కంపెనీ, ప్రమోటర్ల, డెరైక్టర్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీళ్లకు చెందిన అన్ని బ్యాంక్, డిమ్యాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను తక్షణం అటాచ్ చేస్తామని సెబీ పేర్కొంది.
పీఏసీఎల్ ఆస్తుల అటాచ్‌మెంట్
Published Tue, Dec 15 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement