పడవ ప్రమాదంలో 137 మంది ఆచూకీ గల్లంతు!
ఢాకా:బంగ్లాదేశ్ లో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 23 కు చేరింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 137 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. సోమవారం మధ్య బంగ్లాదేశ్ లోని పద్మానదిలో 250 మంది ప్రయాణికులతో బయల్దేరిని పడవ ఆకస్మికంగా మునిగిపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఆ పడవకు 85 మంది ప్రయాణికులను తీసుకుళ్లే సామర్ధ్యం ఉన్నా.. భారీ సంఖ్యలో పడవలో ఎక్కించడంతో ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రికి రక్షణ విభాగం చేపట్టిన సహాయక చర్యల్లో 23 మృతదేహాల ఆచూకీ మాత్రమే లభించింది.
వీరిలో 11 మంది మృతదేహాలను బంధువులకు అందజేసినట్లు ముసిగంజ్ జిల్లా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికీ రెస్క్యూ టీం తమ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో నౌకాయాన మంత్రి షాజహాన్ ఖాన్ కు చెందిన ముగ్గురు బంధువులు ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ లో జరిగిన బోటు ప్రమాదంలో 250 మంది గల్లంతయ్యారు. సోమవారం ఉదయం పద్మా నదిలో బోటు వెక్కిన అనంతరం పినాక్-6 అనే బోటు ముంపుకు గురవ్వడంతో అందులోని ప్రయాణికులు నీట మునిగిపోయారు. మదరిపూరాస్ నుంచి మున్ షిన్ గంజ్ కు వెళుతున్న వీరు ప్రమాదం బారిన పడ్డారు. దీంతో రక్షణ దళాలు, పోలీసులు నౌకలు, స్పీడ్ బోట్ల సాయంతో సహాయక చర్యలను తీవ్రతరం చేశారు.