తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ.. ఆ మూడు రోజలు ఎంతో కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర పార్టీ వివిధ కార్యక్రమా లకు శ్రీకారం చుడుతోంది. రెండు రోజుల కిందట ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనతో పార్టీ సన్నద్ధతకు సంబంధించి ‘ఎజెండా సెట్’ అయిందని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకులు దీనిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు నిచ్చి, పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల్లో ఢిల్లీ నాయకత్వం తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్ తదితరులు రాష్ట్రపార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ‘లియోనియా’రిసార్ట్స్‌లో లేదా కొత్తూరులోని కమలేశ్ పటేల్ యోగా కేంద్రంలో ఈ కార్య క్రమాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
300 మందికి శిక్షణ
రాష్ట్రానికి చెందిన వివిధస్థాయిల్లోని ముఖ్య మైన 300 మంది బీజేపీ నేతలు ఈ శిక్షణకు హాజరవుతారని తెలుస్తోంది. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయస్థాయి లోని వివిధ మోర్చాల పదాధికారులు (రాష్ట్రానికి చెందినవారు), మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు ఉంటారని సమాచారం. శిక్షణ తరగతులు జరిగే మూడురోజులు వారు పూర్తి సమయం అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణకు హాజరయ్యే నేతలెవరూ మధ్యలో బయటకు రాకుండా మొత్తం పార్టీకి సంబంధించిన ఎన్నికల సన్నద్ధతపైనే దృష్టి కేంద్రీకరించేలా జాతీయ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మిగతా రాష్ట్రాల్లోనూ ఏడాదికి ఒకసారి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, తెలంగాణకు సంబంధించి వీటిని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా చేపడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి విస్తృతంగా చర్చించి తగిన వ్యూహాలను ఇందులో ఖరారు చేస్తారని పార్టీవర్గాల సమాచారం.
సమష్టితత్వంతో ముందుకు సాగేలా..
ప్రధానంగా పార్టీనిర్మాణం, సంస్థాగత పటిష్టత, నేతల మధ్య సమన్వయం, సమష్టితత్వంతో ముందుకు సాగేలా ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని స్థాయిల ముఖ్య మైన నాయకుల మధ్య మెరుగైన సమన్వ య సాధనకు ఈ తరగతులు దోహదపడ తాయని చెబుతున్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోలింగ్‌బూత్‌ల స్థాయిలో మరింత చురుగ్గా పనిచేసేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలున్న గట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఈ కసరత్తు తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచర ణను సిద్ధం చేయనున్నారు.
మరోఏడాది పాటు మరింత ప్రభావవంతంగా టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలతో కలిగే ఇబ్బందులను ప్రజలకు వివరించి బీజేపీకి మద్దతు కూడగట్టేందుకు ఈ శిక్షణ ద్వారా దృష్టి పెడతారని పార్టీ వర్గాల సమాచారం. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల విభిన్న రంగాల్లో దేశం సాధిస్తున్న పురోగతిని కూడా వివరించాలని నిర్ణయించారు. దీంతో పాటు కేంద్ర పథకాల ద్వారా పేదలకు చేకూరిన ప్రయోజనాలను తెలియజేయనున్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ప్రభు త్వం ఏర్పడితే ‘డబుల్ ఇంజన్’సర్కార్ ద్వారా రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలకు చేకూరే లాభాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ఎన్నికల వ్యూహంలో భాగంగా ఉంటాయని చెపుతున్నారు.