Paddy cuts
-
సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం
రేగిడి(శ్రీకాకుళం జిల్లా): సాగులో ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ వరికోతపనుల్లో మాత్రం కొడవలిదే ప్రధానపాత్ర. తరతరాలుగా కొడవలి లేనిదే వరి పంట ఇంటికి చేరదంటే అతిశయోక్తి కాదు. సర్రుమని తెగే పదునుతో పాటు చురుకైన పనితనం రేగిడి మండలంలోని వండాన పేట గ్రామం కొడవలి సొంతం, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొడవలి తయారీ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. గ్రామానికి చెందిన కనీసం పది కుటుంబాల వండ్రంగులు వాటిని తయారు చేస్తున్నారు. విజయవాడ నుంచి ముడిసరుకును ఇక్కడికి తీసుకువస్తారు. ముడిసరుకును బాగా కర్రబొగ్గు మధ్యలో వేడి చేసి కరిగించి కొడవలిగా మారుస్తారు. దానికి పదును పెట్టడంతో పాటు కక్కుర్లు వేస్తారు. కుడిచేతి వాటం ఉన్నవారితో పాటు పాటు ఎడమచేతి వాటం వారు కూడా ఈ కొడవలితో అవలీలగా వరి కోత కోయగలరు. సుమారు 60 మందికిపైగా కూలీలు ఈ పనిద్వారా లబ్ధిపొందుతున్నారు. నిత్యం వారికి పని ఉంటుంది. అన్సీజన్లో తయారు చేసిన వాటితో పాటు ప్రస్తుతం తయారుచేస్తున్నవి కూడా హాట్కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ధరతో పాటు డిమాండ్ ఇక్కడ తయారు చేసిన కొడవలి బరువు 300 గ్రాములు ఉంటుంది. దాని పిడిని ఇరుడుకర్రతో వేస్తారు. ఒక దాని తయారీకి గంట సమయం పడుతుంది. రోజుకు సగటున నలుగురు కూలీలు 15 నుంచి 18 వరకు తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఒక దాని ధర రూ. 300 నుంచి రూ.350లు ఉంటుంది. విజయవాడ, చీరాల, ఒంగోలు, ఒడిశా, కోల్కత్తా తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే ముఠామేస్త్రీలు కూడా ఇక్కడి నుంచి కొడవళ్లు తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఒక్కోటి రూ.500కు విక్రయిస్తుంటారు. నిత్యం డిమాండ్ ఖరీఫ్ కోతల సీజన్ ప్రారంభం కావడంతో హాట్కేక్ల్లా అమ్ముడవుతున్నాయి. కొడవలి తయారీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నాం. ప్రతి నెల రూ.15వేల వరకూ ఆదాయం వస్తుంది. - మేటికోటి రామకృష్ణ, తయారీదారు, వండానపేట బంధువులకు పంపిస్తాం ఇక్కడి కొడవలితో కోత బాగా వేగంగా అవుతుంది. ఏటా కొత్తవి కొని ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులకు పంపిస్తాం. ఈ ఏడాది పంపించడానికి 20కిపైగా కొనుగోలు చేశాను. - పైల తవిటినాయుడు, రైతు, చాటాయివలస -
వరికోత.. ఊరినే కోసింది..
మోర్తాడ్ (బాల్కొండ): పచ్చని పంటపొలాలతో కనువిందుచేసే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో సాంఘిక దురాచారం తారస్థాయికి చేరింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి బుధవారం పరస్పరం సాంఘిక బహిష్కరణకు దిగారు. ఇరవై రోజుల కిందట వరి కోత యంత్రాలను అద్దెకిచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చివరకు పరస్పరం బహిష్కరణకు దారితీసింది. వరికోత యంత్రాలు తమ సామాజిక వర్గానికి చెందినవారి పొలాల్లోనే పనిచేయాలని ఒక వర్గం కట్టుబాటు విధించడంతో మరో వర్గం అభ్యంతరం తెలిపింది. అంతకుముందే గ్రామస్తుల మధ్య పలు అంశాలపై భేదాభిప్రాయాలున్నాయి. చివరికి ఒక కులానికి చెందిన సుమారు వంద కుటుంబాలు ఒక సమూహంగా, మిగతా కులాలకు చెందిన 320 కుటుంబాలు మరో సమూహంగా చీలిపోయాయి. ఈ నేపథ్యంలో భూముల కౌలును కూడా రద్దు చేసుకున్నారు. కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఆటోలు ఇతర వ్యాపార సంస్థలను ఎవరికి వారు విభజించుకుని.. ఒక వర్గం వారు మరో వర్గంలోని దుకాణాలకు వెళ్లకుండా కట్టడి చేసుకున్నారు. (చదవండి: స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు) అన్ని కులాల సమూహానికి సంబంధించిన ఆటోలలో ప్రయాణిస్తే రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఒక వర్గం.. తమవారికి కట్టుబాటు విధించింది. మరో పక్క ఒక కులం వర్గం వారికి ఎవరైనా సహకరిస్తే రూ.లక్ష జరిమానా అని మరో వర్గం నిబంధన విధించింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పరచాలని పొరుగు గ్రామాలవారు కోరుతున్నారు. (చదవండి: బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు) -
దెబ్బ మీద దెబ్బ
- పది రోజుల్లో రెండో అల్పపీడనం - వరికి చేటు కలిగించిన అకాలవర్షం - పనల మీదున్న పంటకు భారీ నష్టం - దిగాలు పడుతున్న రైతాంగం రాజమండ్రి : నిన్నటి వరకు నీటి ఎద్దడి. తెగుళ్లు. అడ్డంకుల్ని అధిగమించి పంట పండిస్తే కోతల సమయంలో అకాల వర్షాలు అన్నదాత వెన్నువిరుస్తున్నాయి. రబీ కోతలు మొదలైన గత పది రోజుల్లో రెండు అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాలు రైతులను నష్టాల పాల్జేశాయి. పనల మీద ఉన్న చేలు వర్షం బారిన పడడంతో వారు కుదేలవుతున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్న సమయం కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని వ్యధను మిగిల్చాయి. పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు ఏర్పడిన అల్పపీడనద్రోణి వల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏకధాటిగా వర్షం పడింది. కాకినాడ, తుని, జగ్గంపేట, పిఠాపురం, ఏలేశ్వరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో రెండు గంటల పాటు వర్షం కురిసి, మరో గంటపాటు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఉదయం ఎండ త్రీవత ఎక్కువగా ఉన్నా వాతావరణం ఒక్కసారిగా మారి, సామాన్యులు సేద తీరినా రైతులు మాత్రం నష్టాల పాలయ్యారు. గత పది రోజుల్లో ఇది రెండవ అల్పపీడనం కావడంతో రబీ వరిపంట నష్టం రానురాను పెరుగుతోంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షం వల్ల సుమారు 50 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. తాజాగా వర్షంవల్ల నష్టం మరింత పెరిగే అవకాశముంది. ఆలమూరు, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో నష్టం అధికంగా ఉండే అవకాశముంది. ఇక్కడ 40 శాతానికి పైగా కోతలు పూర్తయ్యాయి. చేలు చాల వరకు పనల మీద ఉన్నాయి. వర్షాల వల్ల చేలు అక్కడక్కడా పడిపోయాయి. దీని వల్ల పెద్ద నష్టం లేకున్నా, పనల మీద ఉన్నచోట నష్టం తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఎకరానికి 10 నుంచి 15 బస్తాల వరకు తగ్గనున్న దిగుబడి జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా చేలు పనల మీద ఉన్నట్టు అంచనా. కాగా, వర్షాల వల్ల ఇక్కడ 30 శాతానికి పైగా రైతులు దిగుబడి కోల్పోనున్నారు. తాళ్లరేవు, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని శివారు గ్రామాల్లో పనలు నీట నానుతున్నాయి. దీనితో రైతులు ఆదరాబాదరాగా నీటిని బయటకు తోడుతున్నారు. ఇటువంటి చోట ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి తగ్గుతుందని వాపోతున్నారు. వర్షాల వల్ల చాలాచోట్ల కోతలు, నూర్పిడులు నిలిచిపోయాయి. డెల్టాలో చేలల్లో నీరు నిలిచి మిషన్లతో కోత కష్టతరమైంది. ఇదే అదనుగా వారు కూలీ ధరలు పెచడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడం వారిని మరింత హడలెత్తిస్తోంది. శ నివారం కూడా ఇలాగే వర్షం పడితే పనల మీద ఉన్న పంటపై ఆశలు వదులు కోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తేమశాతం ఎక్కువగా ఉందని దళారులు ధర తగ్గించి వేస్తుండగావర్షాలు తమను మరింత కుంగదీశాయని బెంగటిల్లుతున్నారు.