వంద రోజుల్లో రూ.386 కోట్ల రుణాలు
- 12,860 మహిళా సంఘాలకు లబ్ధి
- డీఆర్డీఏ పీడీ పద్మజ
ఒంగోలు సెంట్రల్ : రాబోయే వంద రోజుల్లో (అక్టోబర్ నెలాఖరుకల్లా) జిల్లాలోని 12,860 మహిళా సంఘాలకు లబ్ధిచేకూరే విధంగా 386 కోట్ల రూపాయల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ ఎ.పద్మజ వెల్లడించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సంస్థాగత నిర్మాణాలపై అధికారులు, సిబ్బందికి స్థానిక టీటీడీసీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి వరకూ తీసుకున్న రుణాల్లో ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల వరకూ రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన రుణాలను బ్యాంకులకు చెల్లించే విధంగా ఆయా గ్రూపులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇప్పటిదాకా తీసుకున్న రుణాలు చెల్లించనివారు ఈ నెలాఖరులోపు చెల్లిస్తే వడ్డీలేని రుణం వర్తిస్తుందన్నారు. జిల్లాలో స్త్రీనిధి సమృద్ధి పొదుపును 10 శాతం గ్రూపులు మాత్రమే కడుతున్నాయని, ఆ శాతాన్ని 25కు పెంచాలని అధికారులకు సూచించారు. అదే విధంగా స్త్రీనిధి రుణాల రికవరీ శాతం ప్రస్తుతం 60గా ఉందని, దాన్ని 98కి పెంచాలని కోరారు. అందుకోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 2,200 గ్రూపులకుగానూ 1,600 గ్రూపులు మాత్రమే మొబైల్ డేటాను పూర్తి చేశాయని, మిగిలిన గ్రూపులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పీడీ ఆదేశించారు. నెలాఖరులోపు ఆడిట్ రిటర్న్‌లను డీసీవోకు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీలు రవికుమార్, రాజేంద్ర, స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం.ధర్మేంద్ర, డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్, బ్యాంక్ లింకేజీ డీపీఎం సుబ్బారావు, ఐబీ డీపీఎం విశాలాక్షి, జ్యోతిప్రసాద్, జిల్లాలోని అన్ని ఏరియాల కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.