‘పద్మరాజ్’ సిఫార్సులను పరిశీలిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో బీడీఏ జీ కేటగిరీ నివేశన స్థలాల పంపిణీలో అవ కతవకలు చోటు చేసుకున్నందున, వాటిని వెనక్కు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పద్మరాజ్ కమిటీ చేసిన సిఫార్సులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ధరం సింగ్, కుమారస్వామి, యడ్యూరప్పల హయాంలో ముఖ్యమంత్రి విచక్షణ కోటాలో మొత్తం 313 నివేశన స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేశారని కమిటీ తేల్చిన సంగతి తెలిసిందే.
ఆదివారం ఇక్కడి కాక్స్ టౌన్లో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమిటీ నివేదికను తానింకా పరిశీలించ లేదని చెప్పారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. కాగా నగరానికి అధిక తాగు నీటి సరఫరా, ప్రాథమిక సదుపాయాల కల్పనపై బెంగళూరు జల మండలి విశ్రాంత అధ్యక్షుడు త్యాగరాజన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కుటుంబ నియంత్రణ పాటించాలి
నూతన వధూవరులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితమై కుటుంబ నియంత్రణను పాటించడం ద్వారా జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నూతన వధూవరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబం వల్ల పిల్లలకు ఉత్తమ విద్యను, సదుపాయాలను అందించవ చ్చని అన్నారు. నిరాడంబర పెళ్లిళ్లకు ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా అనవసర ఖర్చులను తగ్గించవచ్చని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే అనేక హామీలను నెరవేర్చిందని అన్నారు.