నియోజకవర్గ అభివృద్ధికి కృషి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో గెలిపిస్తే బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని పలువురు అభ్యర్థులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులతో ఉమ్మడి వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎరుకల రాజ్‌కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పత్తిసాగు గణనీయంగా ఉందన్నారు.
పత్తికి అనుబంధంగా కాటన్ టెక్స్టైల్స్ పార్కును నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు లభించేలా చూస్తానన్నారు. నియోజకవర్గంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. విద్యుత్ సమస్య లేకుండా మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలోని సామాజిక కమ్యూనిటీ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి వంద పడకలకు పెంచుతానని, ఉన్నత విద్య చదవడం కోసం పీజీ, ఇతర కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మెడికల్ కళాశాల మంజూరుకు..
టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, బెల్లంపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి పాటుపడతానన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉం డి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రవాణా అభివృద్ధికి..
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి చిలుముల శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని భీమిని, వేమనపల్లి మండలాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేవన్నారు. మండలాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా గోదావరి నుంచి నేరుగా బెల్లంపల్లికి ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటు చేసి గోదావరి జలాలు సరఫరా చేయిస్తానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు.
ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా మాట్లాడారు. నియోజకవర్గ ఓటర్లు ఆదరించి గెలిపిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. అయితే సీపీఐ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి గుండా మల్లేశ్, టీడీపీ అభ్యర్థి పాటిసుభద్ర ఈ కార్యక్రమాన్ని గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థులు ప్రజలు అడిగిన ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమానికి ఎన్నికల నిఘా వేదిక నాయకులు కమల్, పోచయ్య, జి.మోహన్, ఇ. చంద్రశేఖర్, జి.లక్ష్మి, ఇ.సువర్ణ, రంగ ప్రశాంత్, దాసరి విజయ తదితరులు పాల్గొన్నారు.