లోక్‌సభ ఎన్నికలు 18 మందితో ఎన్సీపీ జాబితా
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు శరద్‌పవార్ నేతృత్వంలోని 18 మంది అభ్యర్థులతో ఎన్సీపీ జాబితా ప్రకటించింది. తన కోటాలో మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో హింగోలి, హాత్కణాంగలే, మావల్, బీడ్ నియోజకవర్గాలకు అభ్యర్థులెవరనే అంశంపై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి అంతా అనుకుంటున్నట్టుగానే కొందరు సీనియర్ మంత్రులను ఎన్సీపీ... ఈ ఎన్నికల బరిలోకి దింపింది. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌ను ఈ ఎన్నికల బరిలోకి దింపనుందంటూ అనేక రోజులుగా ఊహాగానాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు తెరదింపుతూ నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఛగన్ భుజ్‌బల్‌ను బరిలోకి దింపనున్నట్టు ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు సాతారా నుంచి ఉదయన్‌రాజే భోస్లేకు టికెట్ ఇస్తుందా?లేదా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైనా ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా ఉదయన్‌రాజే పేరును ప్రకటించింది. వీరితోపాటు భాండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రఫుల్ పటేల్, బారామతి నుంచి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఠాణే నుంచి సంజీవ్ నాయిక్, ఉస్మానాబాద్ నుంచి పద్మసింగ్ పాటిల్, ముంబై నుంచి సంజయ్ దీనాపాటిల్లను బరిలోకి దింపనుంది. ఇక శరద్‌పవార్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్ జిల్లాలోని మాఢా లోక్‌సభ నియోజకవర్గంలో ఎట్టకేలకు విజయ్‌సింహ్ మోహి తే పాటిల్, కొల్హాపూర్ స్థానానికి ధనంజయ్ మాడిక్లను ప్రకటించింది. ఇక శివసేన నుంచి ఎన్సీపీలో చేరిన ప్రస్తుత ఎంపీ ఆనంద్ పరాంజ్‌పేను కల్యాణ్ నుంచి బరిలోకి దింపుతోంది. గతంలో ఆయన కల్యాణ్ నియోజకవర్గం నుంచి శివసేన టికెట్‌పై గెలుపొందారు. ఆనంద్ పరాంజ్పే ఇటీవలే ఎన్సీపీలో చేరిన సంగతి విదితమే. తన కోటాలోని మొత్తం 22 నియోజకవర్గాల్లో 18 మందితో జాబితాను విడుదల చేసిన ఎన్సీపీ... మిగిలిన నాలుగు స్థానాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
ఈ నేపథ్యంలో ఆయా స్థానాలనుంచి ఎవరిని బరిలోకి దింపనున్నారు? అభ్యర్థుల జాబితాను ఎందుకు ప్రకటించలేదనే విషయమై అందరి దృష్టీ కేంద్రీకృమైంది. గట్టి పోటీ ఎదురవనుందనే ఆలోచన కారణంగానే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎన్సీపీ అధిష్టానం జాప్యం చేస్తోందని తెలుస్తోంది. వీటిలో బీడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు మంచి పట్టు ఉంది. మరోవైపు హత్కణాంగలే, హింగోళి, మావల్ లలో శివసేన అత్యంత పటిష్టంగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గాలలో కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ శివసేనతోపాటు అటు గోపీనాథ్ ముండేను ఎదుర్కొనే సత్తా కలిగిన నాయకులను బరిలోకి దింపాలని ఎన్సీపీ యోచిస్తున్నట్టు తెలియవచ్చింది. కాగా బీజేపీ కూడా గురువారం లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కుమార్తె డాక్టర్ హీనాగావిత్ కూడా ఉన్నారు. ఈమెకు బీజేపీ అధిష్టానం నందుర్బార్ టికెట్‌ను కేటాయించింది.
అభ్యర్థుల వివరాలు
ఈశాన్య ముంబై: సంజయ్ దీనాపాటిల్, నాసిక్: ఛగన్ భుజ్‌బల్, భండారా-గోండియా: ప్రఫుల్ పటేల్, ఉస్మానాబాద్: పద్మసింహ్ పాటిల్, బారామతి: సుప్రియా సూలే, సాతారా: ఉదయన్ రాజే భోస్లే, జల్గావ్: సతీష్ పాటిల్, ఠాణే: సంజీవ్ నాయిక్, కల్యాణ్-డోంబివలి: ఆనంద్ పరాంజ్పే, అహ్మద్‌నగర్: రాజీవ్ రాజలే, రావేర్: మనీష్ జైన్, బుల్డాణా: కృష్ణరావ్ ఇంగలే, శిరూర్: దేవదత్త నికమ్, పర్భణి: విజయ్ కాంబ్లే, కొల్హాపూర్: ధనంజయ్, అమరావతి: నవనీత్ రాణా, దిండోరి: భారతీ, మాఢా: విజయ్‌సింహ్ మోహితేపాటిల్.