‘మహా’ ఒప్పందంతో ప్రజల భవిష్యత్తు తాకట్టు
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ
జోగిపేట:మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహితపై తమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల ఎత్తుకు తగ్గించడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి చర్చలు జరిపినా అక్కడి ప్రభుత్వం అంగీకారానికి రాకపోవడంతో ఒప్పందాలు నిలిచిపోయాయని అన్నారు. తాము చివరి వరకూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 152 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
మహరాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వట్టి బూటకమన్నారు. ఒప్పందాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. మల్లన్న సాగర్ కోసం డీపీఆర్‌లు లేకుండా భూములు ఎలా లాక్కుంటారని ఆయన ప్రశ్నించారు. గ్రామ సభలు, పునరావాసం కల్పించకుండానే భూములను లాక్కోవడం అప్రజాస్వామ్యమే అవుతుందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. మల్లన్న సాగర్‌ను ఏ నదికి, ఏ ఉప నదికి అనుసంధానంగా నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి పక్షాలు ముంపు గ్రామాల ప్రజలను కలవనీయకుండా కుట్రలు చేస్తోందని అన్నారు. బాధితులకు ఊరికి ఊరు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
2018లోనే ఎన్నికలు
ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం 2019వ సంవత్సరం వరకు ఉన్నా ఒక సంవత్సరం ముందే అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని దామోదర అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జీఆర్.కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎస్.సురేందర్‌గౌడ్, తదితరులు ఆయన వెంట ఉన్నారు.
మెదక్‌లో విపక్షాల ఆందోళన
మెదక్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తున్నా పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ విపక్షాలు నిరసనకు దిగాయి. శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, మెదక్ జిల్లా సాధన సమితి, ఇతర కుల, ప్రజా సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేవలం 14 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయడంపై పెదవిరిచారు. స్వరాష్ట్రంలోనూ మెదక్ జిల్లాకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
- మెదక్