పనీపాటా లేకుండా.. కోట్లు నొక్కేశారు!
షిల్లాంగ్: కొందరు ఉద్యోగులు ఏ పనీపాటా లేకుండా ఎనిమిదేళ్లలో రూ.5.69 కోట్లు సంపాదించారు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా 34.42 కోట్ల అవినీతి జరిగిందని గుర్తించారు. మేఘాలయ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ లాటరీస్(డీఎస్ఎల్)కు సంబంధించి ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ రిపోర్ట్ ప్రకారం.. 2001లో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్ఎల్ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2008లో ఆ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ ఉద్యోగులు మాత్రం పనిచేస్తున్నట్లుగా సంబంధిత రిజిస్టర్లో ప్రతిరోజు దాదాపు ఎనిమిదేళ్లు సంతకాలు చేశారు.
27 మంది ఉద్యోగులు డీఎస్ఎల్ కింద విధులకు హాజరవుతున్నట్లుగా రికార్డులు సృష్టించారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, టాక్సేషన్, స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఇలా ఏ డిపార్ట్మెంట్లలోనూ వీరు పని చేయకుండా ఏకంగా 5.69 కోట్లు రాబట్టుకున్నారు. డీఎస్ఎల్ లో 112 మంది ఉద్యోగులు ఉండాలి కానీ, అది రద్దయిన తర్వాత 27 మంది మాత్రం పనిచేస్తున్నట్లుగా చూపించారని కాగ్ వెల్లడించింది.
మేఘాలయ స్టేట్ లాటరీ రూల్స్ 2002 ప్రకారం, స్టేట్ లాటరీ స్కీమ్స్ రెగులేటెడ్ అండర్ ద లాటరీస్ (రెగ్యులేషన్) యాక్ట్ 1988 ప్రకారం రూ.34.42 కోట్ల అవినీతి జరిగినట్లు కాగ్ గుర్తించింది. ఫెస్టివల్స్ అనే సాకుతో మరో 12.44 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. ఈ అక్రమాలు, అవినీతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.