అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. పైడితల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు.
సంప్రదాయ బద్ధంగా..
హుకుంపేట నుంచి సిరిమాను మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం వద్దకు చేరుకుంది. సాయంత్రం 5.10 గంటలకు ఉత్సవం పూర్తయింది. చివరగా మూడోసారి ఉత్సవం పూర్తవుతుందనగా వర్షం కురవడంతో భక్తజనం తన్మయత్వం పొందారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎస్పీ దీపికా ఎం.పాటిల్ ఏర్పాట్లను పర్యవేక్షిచారు.
భక్తుల జయజయధ్వానాల నడుమ..
అమ్మవారి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. సిరిమాను మూడులాంతర్లు వద్ద నున్న ఆలయం నుంచి జయజయధ్వానాల మధ్య బయలుదేరింది. ఆలయ ప్రధాన అర్చకులు దూసి కృష్ణమూర్తి పూర్ణకుంభంతో ముందు వెళ్లగా.. ఆ ప్రాంతమంతా భక్తిభావం నెలకొంది. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, దేవదాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, దివంగత ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు.