paijama
-
యువతులను మించిపోయిన కుర్రాళ్లు
బంజారాహిల్స్: అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులోని ఓ సన్నివేశంలో హీరోయిన్ ఇలియానా వదులుగా ఉన్న కుర్తాపైజామా ధరిస్తుంది. ఆమెను చూసిన తండ్రి ధర్మవరపు సుబ్రమణ్యం ‘కర్టెన్ చాటున ఎందుకు దాక్కున్నావే’ంటని అడుగుతాడు. తాను కర్టెన్ చాటునలేనని ఇలియానా చెప్పడంతో ధర్మవరపు ఆమె డ్రెస్సును చూసి ఆశ్చర్యపోతాడు. అప్పటికి వదులుగా ఉన్న డ్రెస్సులను వెటకారంగా చూపిస్తే.. ఇప్పుడవే ఫ్యాషనైపోయాయి. వదులుగా ఉన్న డ్రెస్సులే యువతను కిక్కెక్కిస్తున్నాయి. లూజుగా ఊగుతూ ఉంటేనే లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. ఇది షర్టేనా అని ఆశ్చర్యపోవాల్సి వస్తున్నది. రోజురోజుకు నగరానికి ఫ్యాషన్ సెగ తగులుతుండగా కొత్తకొత్త డిజైన్లు ఊపిపడేస్తున్నాయి. హైదరాబాద్ యువత రొటీన్ లుక్ భిన్నంగా అందరిలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారు. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు దీటుగా సరికొత్త ఫ్యాషన్ లుక్‌తో దూసుకెళుతోంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నేటి యూత్ కొత్త లుక్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం యువత అంతా యువ నటుడు విజయ్ దేవరకొండను తమ ఫ్యాషన్ ఐకాన్‌గా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే విజయ్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరికొత్తగా అభిమానుల ముందుకొస్తున్నారు. అతడు ధరించిన డ్రెస్‌లను యువత బాగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం నగర యువతకు కొత్త ఫ్యాషన్‌గా ‘కౌల్ కుర్తా’ (డ్రేప్ డిజైన్) అందుబాటులోకి వచ్చింది. గ్రీక్ స్టైల్లో ఉండే ఈ దుస్తులు ఓల్డ్ రోమన్స్ లుక్‌ను తలపిస్తున్నాయి. కొంతకాలంగా విజయ్ దేవరకొండతో పాటు సందీప్ కిషన్, హర్షవర్థన్ రాణే, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అడవి శేష్, నిఖిల్‌తో పాటు హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, ఈషారెబ్బా, హిమ ఖురేషి తదితరులు ఈ దుస్తుల్లో హొయలొలికిండంతో యువతకు కూడా అదే ఫ్యాషన్ ఫీవర్ పట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ యువత రొటీన్ లుక్‌లో కాకుండా డిఫరెంట్ లుక్‌ను కోరుకుంటున్నారని యువ ఫ్యాషన్ డిజైనర్ వరుణ్ చకిలం తెలిపారు. ఈ డ్రేప్ డిజైన్‌ను నగర యువతకు పరిచయం చేసింది ఆయనే కావడం విశేషం. నిన్న మొన్నటి వరకు అమ్మాయిలు మాత్రమే ఫ్యాషన్‌గా ఉండాలని అనుకునేవారని, ఇప్పుడు వారికి మించి యువకులు తామే కొత్తలుక్‌లో కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారని చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన దుస్తులు ధరించాలని కోరుకుంటున్నారని చెబుతున్నారాయన. యువతులను మించిపోయిన కుర్రాళ్లు కొత్తగా వచ్చిన ఈ గ్రీక్ స్టైల్ డ్రేప్ డిజైన్ కౌల్ కుర్తా ఖరీదు రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. దీనికితోడు కొత్తగా స్ట్రక్చర్ జాకెట్లు కూడా యువతను ఆకర్షిస్తున్నాయి. చూస్తే ఇవేం దుస్తులని కొట్టిపారేస్తుంటాం. అయితే ఇప్పుడు అవే యువతను వెర్రెక్కిస్తున్నాయి. సినిమాల్లో తమ అభిమాన హీరోలు ధరించిన దుస్తులను వేసుకోవడం అభిమానులకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు కాగా ఇటీవల ఇది మరింత ఎక్కువైందని ఫ్యాషన్ డిజైనర్లు పేర్కొంటున్నారు. కొత్త పోకడలు పోతున్న ఈ స్టైలిష్ డిజైన్లు ఇప్పుడు నగర షోరూమ్‌లను ముంచెత్తుతున్నాయి. కౌల్ కుర్తా ధరిస్తే బోహిణియన్ లుక్‌లో కనబడతారని డిజైనర్లు చెబుతున్నారు. నగరానికి చెందిన పది మంది యువ ఫ్యాషన్ డిజైనర్లు రోజుకొక కొత్త డిజైన్ దుస్తులను యువకుల కోసం పరిచయం చేస్తున్నారు. వీటికి ఆదరణ కూడా బాగుందని వీరు పేర్కొంటున్నారు. ఒకప్పుడు కేవలం ఫ్యాషన్ దుస్తులు, కొత్త డిజైన్లు యువతులకే పరిమితంకాగా.. ఇప్పుడు అబ్బాయిలు కూడా వారిని మించిపోతున్నారంటున్నారు. ప్యారిస్, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు చెందిన డిజైన్లు ఇప్పుడు నగర షోరూమ్‌లలో కొలువుదీరుతున్నాయంటే ఇక్కడి ఫ్యాషన్ ట్రెండ్‌తో పాటు బిజినెస్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. -
శారీ స్కూల్లో చేరుదామా!
చాలా ఏళ్లకు పూర్వం చీరను ఆడవారు, మగవారు ఇద్దరూ ధరించేవారు. రానురాను చీర అనే పదం ఆడవారు కట్టుకునే వస్త్రంగా మారిపోయింది. చీర కట్టు అంటే కేవలం చీర కట్టేనా?అందులో ఎన్ని రకాలు?తమిళ కట్టు, అస్సామీ కట్టు, గుజరాతీ కట్టు, మార్వాడీ కట్టు, బెంగాలీ కట్టు, తెలుగు కట్టు... ప్రతి ప్రాంతానికి ఈ చీరకట్టు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుంది. ఒకప్పుడు పండుగలు, శుభకార్యాల సమయంలో పెద్దవాళ్లు కచ్చాపోసి చీర కట్టేవారు. అంటే రెండు కాళ్ల మధ్య నుంచి తిప్పుతూ కట్టేవారు. ప్రస్తుతం ఆ చీర కట్టు బాగా తగ్గిపోయింది. అంతేనా?... అసలు చీర కట్టే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే చీరలకు గత వైభవం తీసుకురావాలనుకున్నారు బెంగాల్‌కు చెందిన దబోండిని టాగూర్. బెంగాల్లో స్త్రీ సాధికారత కోసం పాటుపడుతున్నా దబోండిని బీరువాలో వెనక్కు వెళ్లిపోయిన చీరలను మళ్లీ ముందుకు తీసుకురావాలని సంకల్పించారు. ఏడు గజాల చీరలు లేదా తొమ్మిది గజాల చీరల సంస్కృతిని ఒక ఫ్యాషన్‌గా ప్రచారం చేస్తున్నారు. చీర కట్టును పైజమా మోడల్లో రెడీమేడ్‌గా కుట్టి ధరించే పద్ధతిని ప్రచారం చేస్తున్నారు. వీటిని కట్టుకోవడం వల్ల ఫెమినైన్ అప్పీల్ ఉంటోందని, కట్టుకోవడం సులువుగా ఉంటోందని చెబుతున్నారు అమ్మాయిలు. టాగూర్ కృషితో చాలామంది ఆధునిక మహిళలు పైజమా మోడల్లో చీరలు కట్టుకుంటున్నారు. కలిసిన చేతులు పుణేకు చెందిన నికాయతా అనే పారిశ్రామికవేత్త దబోండినితో చేతులు కలిపారు. చీరకు ప్రచారం తేవడానికి ముందుకు వచ్చి తొమ్మిది గజాల చీరను రెడీమేడ్‌గా కట్టుకుని ఆ కట్టుకు ప్రచారం తేవడం ప్రారంభించారు. ఆధునిక వస్త్రధారణ కేవలం వందేళ్లుగా వచ్చిన విధానం కాని చీర కట్టు వందల ఏళ్లుగా ఉందని అంటారామె. ఇలాంటి వారిని చూసి దబోండిని మరింత ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాలుగా ‘ఇండియన్ డ్రేపింగ్ కంపెనీ’ ద్వారా అనేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. చరిత్రలో మన చీరల విధానం చూపిస్తూ, ప్రతి వర్క్‌షాపులోనూ, చీరల వస్త్రధారణ గురించి వివరిస్తున్నారు. అన్ని ప్రాంతాల రీతులు చీరకట్టును అధ్యయనం చేయడానికి దబోండిని టాగూర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఆయా ప్రాంతాల చేనేతలు, కట్టువిధానం గురించి తెలుసుకుంటున్నారు. ఏ వాతావరణానికి ఏ వస్త్రాలు ధరిస్తున్నారో పరిశీలించారు. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అందమైన చీరకట్లు ఉన్నాయి అంటారామె. కేవలం శుభకార్యాల సమయంలో మాత్రమే కాకుండా, నిత్యం ధరించడానికి ఆసక్తి చూపేలా వీటిని చేయాలనుకుంటున్నారు టాగూర్. ప్రస్తుతం పట్టణాలలో మహిళలు కేవలం వివాహాది శుభకార్యాలలో మాత్రమే చీరలు ధరిస్తున్నారు. వీరిని ఆకర్షించడమే టాగూర్ ప్రధాన ఉద్దేశం. నికాయతా కూడా ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. భారతదేశంలో అనాదిగా చీరను శుభకార్యాలలో తప్పనిసరిగా ధరించేవారు. గిరిజన మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్లే సమయంలో చీరను గోచీలా కట్టి, భుజాల మీద ముడి వేసి కట్టేవారు. తీర ప్రాంత మత్స్యకారులు పొట్టిగా ఉండే రెండు వస్త్రాలు, పైన ఒకటి, కింద ఒకటి సముద్రంలో తేలికగా కదలడానికి అనువుగా ధరించేవారు. ఇవన్నీ కొంచెం తీర్చిదిద్దుకుంటే మంచి ఫ్యాషన్‌గా మారతాయని దబోండిని, నికాయతాల అభిప్రాయం. ప్యాంట్, షర్టు వేసుకునేంత స్పీడుగా చీరను కట్టుకునే విధంగా వాటిని రెడీమేడ్‌గా కుట్టి అందుబాటులో ఉంచాలని వీరి ప్రయత్నం. స్కర్ట్ వేసుకున్నంత తేలికగా చీరను ధరించేలా రూపొందిస్తున్నారు. ‘మన సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా, ఆధునికతను మేళవిస్తూ చీర కుట్టకునేలా మోటివేట్ చేస్తున్నాం’ అంటున్నారు నికాయతా. ‘ఫేర్వెల్, శుభకార్యాలు వంటి సమయాలలో మాత్రమే నేను చీరకట్టుకునే దానిని. 2016లో వివాహం అయ్యాక, చీర కట్టుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. ప్రతిసారీ ఎవరో ఒకరి సహాయంతో చీరకట్టుకోవడం రానురాను సిగ్గు వేసింది. అందుకే 14 రోజుల పాటు చీర కట్టుకోవడం దీక్షగా నేర్చుకున్నాను. అంతేనా చీరకట్టులో మాస్టర్ అయిపోయాను’ అంటున్న నికాయతా, టాగూర్ ప్రభావంతో రకరకాల చీర కట్టు విధానాల మీద పరిశోధన ప్రారంభించారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలన్నా, రెండు నిమిషాలలో చీర ధరిస్తున్నారు నికాయతా. ఆమె చేసిన నిరంతర పరిశోధనకు ఫలితంగా, ‘శారీస్ ఆఫ్ ఇండియా’ పుస్తక రచయిత, పరిశోధకురాలు అయిన ఆర్టీఏ కపూర్ చిస్టీ శారీ స్కూల్ వర్క్‌షాపులో ప్రసంగించారు.‘మూడువారాల పాటు నిర్వహించిన వర్క్‌షాపులో యువతులు ఆసక్తిగా వచ్చి పాల్గొన్నారు. ఎంతో కొంత నేర్చుకున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది, ధైర్యంగా చీర కట్టుకోవడం మొదలుపెట్టారు’ అంటారు నికాయతా.దబోండిని, నికాయతా లాంటి చీర అభిమానులు, ఆర్టీఏ కపూర్ చిస్టీ వంటి రచయితలు చీరకు కల్పిస్తున్న ప్రచారం తీసిపారేయదగ్గది కాదు.ప్రతిదీ తిరిగి వస్తుంది.ఫ్యాషన్‌లో పాతదే కొత్తగా అవతరిస్తుంది. ఇవాళ చీర కొత్త ఫ్యాషన్ పుంతను తొక్కడం ఆనందించాల్సిన విషయమే. -
'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని'
ప్రధాని నరేంద్రమోదీ తన కుర్తా రహస్యం చెప్పారు. తన ముందున్న పరిస్థితులే తనను ఆ దుస్తులు వేసుకునేలా చేశాయి తప్ప తనకేం ఫ్యాషన్ డిజైనర్ లేడని మోదీ చెప్పారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులతో సంభాషించిన ఆయనను పలువురు విద్యార్థులు కుర్తా విషయంలో ప్రశంసించారు. భారతీయ వస్త్ర సంప్రదాయానికి ఆయనొక అంబాసిడర్ అని విద్యార్థులు కొనియాడారు. ఈ సందర్భంగా వారివైపు చిరునవ్వుతో చూస్తూ తన కుర్తా గురించి వివరించారు. 'నా కుర్తాకు సంబంధించి ప్రత్యేక డిజైనర్ ఉన్నాడనే వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను సాదాసీదాగా ఉండాలనే వీటిని ధరిస్తాను. గుజరాత్లో చలి ఉండదు. చాలాసార్లు నా దుస్తులు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. అందుకు నా దుస్తులు నేనే ఉతుక్కునేవాడిని. అవి ఉతికేందుకు తేలికగా ఉంటాయి. దానివల్ల సమయం ఆదా అయ్యి మిగతా పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే నేను వాటిని ధరిస్తాను. ధరించే దుస్తులు కనిపించడానికి బాగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కావు. అందుకే చెంబులో నిప్పులు వేసి ఇస్త్రీ చేసుకునేవాడిని. వాటికి తగినట్లు కాన్వాస్ షూ వేసుకునేవాడిని. అలా అలవాటయిందే కుర్తా తప్ప ప్రత్యేక డిజైనర్ నాకు లేడు. ఏదేమైనా ఓ కార్యక్రమానికి తగినట్లుగా దుస్తులు ధరించాలనేది నా అభిప్రాయం' అని మోదీ చెప్పారు.