యువతులను మించిపోయిన కుర్రాళ్లు | New look For Youth icon Vijay Devarakonda Fashion | Sakshi
Sakshi News home page

న్యూలుక్‌ కోరుకుంటున్న యువత

Published Fri, Dec 6 2019 7:57 AM | Last Updated on Fri, Dec 6 2019 7:57 AM

New look For Youth icon Vijay Devarakonda Fashion - Sakshi

బంజారాహిల్స్‌: అల్లు అర్జున్‌ నటించిన ‘జులాయి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులోని ఓ సన్నివేశంలో హీరోయిన్‌ ఇలియానా వదులుగా ఉన్న కుర్తాపైజామా ధరిస్తుంది. ఆమెను చూసిన తండ్రి ధర్మవరపు సుబ్రమణ్యం ‘కర్టెన్‌ చాటున ఎందుకు దాక్కున్నావే’ంటని అడుగుతాడు. తాను కర్టెన్‌ చాటునలేనని ఇలియానా చెప్పడంతో ధర్మవరపు ఆమె డ్రెస్సును చూసి ఆశ్చర్యపోతాడు. అప్పటికి వదులుగా ఉన్న డ్రెస్సులను వెటకారంగా చూపిస్తే.. ఇప్పుడవే ఫ్యాషనైపోయాయి. వదులుగా ఉన్న డ్రెస్సులే యువతను కిక్కెక్కిస్తున్నాయి. లూజుగా ఊగుతూ ఉంటేనే లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా మారింది. ఇది షర్టేనా అని ఆశ్చర్యపోవాల్సి వస్తున్నది. రోజురోజుకు నగరానికి ఫ్యాషన్‌ సెగ తగులుతుండగా కొత్తకొత్త డిజైన్‌లు ఊపిపడేస్తున్నాయి.  

హైదరాబాద్‌ యువత రొటీన్‌ లుక్‌ భిన్నంగా అందరిలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారు. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు దీటుగా సరికొత్త ఫ్యాషన్‌ లుక్‌తో దూసుకెళుతోంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నేటి యూత్‌ కొత్త లుక్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం యువత అంతా యువ నటుడు విజయ్‌ దేవరకొండను తమ ఫ్యాషన్‌ ఐకాన్‌గా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే విజయ్‌ ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరికొత్తగా అభిమానుల ముందుకొస్తున్నారు. అతడు ధరించిన డ్రెస్‌లను యువత బాగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం నగర యువతకు కొత్త ఫ్యాషన్‌గా ‘కౌల్‌ కుర్తా’ (డ్రేప్‌ డిజైన్‌) అందుబాటులోకి వచ్చింది. గ్రీక్‌ స్టైల్‌లో ఉండే ఈ దుస్తులు ఓల్డ్‌ రోమన్స్‌ లుక్‌ను తలపిస్తున్నాయి. కొంతకాలంగా విజయ్‌ దేవరకొండతో పాటు సందీప్‌ కిషన్, హర్షవర్థన్‌ రాణే, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అడవి శేష్, నిఖిల్‌తో పాటు హీరోయిన్‌లు రకుల్‌ ప్రీత్‌సింగ్, రెజీనా, ఈషారెబ్బా, హిమ ఖురేషి తదితరులు ఈ దుస్తుల్లో హొయలొలికిండంతో యువతకు కూడా అదే ఫ్యాషన్‌ ఫీవర్‌ పట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ యువత రొటీన్‌ లుక్‌లో కాకుండా డిఫరెంట్‌ లుక్‌ను కోరుకుంటున్నారని యువ ఫ్యాషన్‌ డిజైనర్‌ వరుణ్‌ చకిలం తెలిపారు. ఈ డ్రేప్‌ డిజైన్‌ను నగర యువతకు పరిచయం చేసింది ఆయనే కావడం విశేషం. నిన్న మొన్నటి వరకు అమ్మాయిలు మాత్రమే ఫ్యాషన్‌గా ఉండాలని అనుకునేవారని, ఇప్పుడు వారికి మించి యువకులు తామే కొత్తలుక్‌లో కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారని చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన దుస్తులు ధరించాలని కోరుకుంటున్నారని చెబుతున్నారాయన.  

యువతులను మించిపోయిన కుర్రాళ్లు
కొత్తగా వచ్చిన ఈ గ్రీక్‌ స్టైల్‌ డ్రేప్‌ డిజైన్‌ కౌల్‌ కుర్తా ఖరీదు రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. దీనికితోడు కొత్తగా స్ట్రక్చర్‌ జాకెట్లు కూడా యువతను ఆకర్షిస్తున్నాయి. చూస్తే ఇవేం దుస్తులని కొట్టిపారేస్తుంటాం. అయితే ఇప్పుడు అవే యువతను వెర్రెక్కిస్తున్నాయి. సినిమాల్లో తమ అభిమాన హీరోలు ధరించిన దుస్తులను వేసుకోవడం అభిమానులకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు కాగా ఇటీవల ఇది మరింత ఎక్కువైందని ఫ్యాషన్‌ డిజైనర్లు పేర్కొంటున్నారు. కొత్త పోకడలు పోతున్న ఈ స్టైలిష్‌ డిజైన్లు ఇప్పుడు నగర షోరూమ్‌లను ముంచెత్తుతున్నాయి. కౌల్‌ కుర్తా ధరిస్తే బోహిణియన్‌ లుక్‌లో కనబడతారని డిజైనర్లు చెబుతున్నారు. నగరానికి చెందిన పది మంది యువ ఫ్యాషన్‌ డిజైనర్లు రోజుకొక కొత్త డిజైన్‌ దుస్తులను యువకుల కోసం పరిచయం చేస్తున్నారు. వీటికి ఆదరణ కూడా బాగుందని వీరు పేర్కొంటున్నారు. ఒకప్పుడు కేవలం ఫ్యాషన్‌ దుస్తులు, కొత్త డిజైన్లు యువతులకే పరిమితంకాగా.. ఇప్పుడు అబ్బాయిలు కూడా వారిని మించిపోతున్నారంటున్నారు. ప్యారిస్, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు చెందిన డిజైన్‌లు ఇప్పుడు నగర షోరూమ్‌లలో కొలువుదీరుతున్నాయంటే ఇక్కడి ఫ్యాషన్‌ ట్రెండ్‌తో పాటు బిజినెస్‌ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement