శబరిమల హుండీలో పాక్ కరెన్సీ కలకలం
శబరిమల: ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయ హుండీలో పాకిస్తాన్ కరెన్సీ నోటు బయటపడటం కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఆలయ హుండీని తెరవగా అందులో రూ. 20 పాకిస్తాన్ నోటు కనిపించింది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు విదేశీ కరెన్సీని కానుకగా వేయటం సహజమే అయినప్పటికీ పాకిస్తాన్ నోటు కావటంతో పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ నోటు హుండీలో ఎవరు వేశారనే విషయాన్ని తేల్చడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పత్తనమిట్టలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. నవంబర్ నుంచి జనవరి వరకు మాల ధారులు, భక్తుల కోసం నిరవధికంగా తెరిచి ఉంటుంది. ఆ తర్వాతి కాలం మళయాళ క్యాలండర్ ప్రకారం నెలలో ఐదు రోజులు తెరచి ఉంటుంది.