Pakistan visa
-
వీసామాత సుష్మాకు కోపం వచ్చింది!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మెడికల్ మాతా...వీసామాతా....! కేంద్రంలోని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్లో ఆమె ఫాలోవర్లు పెట్టిన నిక్ నేమ్. వైద్యం కోసమో, మరే అవసరం కోసమో పాకిస్థాన్ పౌరులకు కోరిందే తడువుగా ఉదారంగా ఆమె వీసాలు మంజూరు చేస్తుండడంతో వారికి కోపం వచ్చింది. మెడికల్ మాతా...వీసా మాతా..అంటూ ఆమెను సంబోధిస్తూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. అలాంటి ట్వీట్లకు సుష్మా స్వరాజ్‌కు కూడా ముక్కుపుటాలు అదిరేలా కోపం వచ్చినట్టుంది. వెంటనే తనను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నవారందరి ఖాతాలను బ్లాక్ చేసింది. సామాన్య ప్రజలు తమకు ఇష్టం లేని వారి ఖాతాలను బ్లాక్చేస్తే తప్పులేదు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కానీ కేంద్రంలో ఓ బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా ఫాలోవర్లను బ్లాక్‌చేయడం ఎంతవరకు సబబు? ఇప్పుడు ఈ అంశంపైనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక తలకు పది తలలను తీసుకెళతామంటూ సవాల్ విసిరిని పాకిస్థాన్ లాంటి శత్రు దేశస్థులకు ఉదారంగా వీసాలు ఎందుకు మంజూరు చేస్తున్నారని ఎక్కువ మంది ట్విట్టర్లో సుష్మాను ప్రశ్నించారు. ‘ఇలా ట్విట్టర్ ద్వారా వీసాలను మంజూరు చేస్తున్న విదేశాంగ మంత్రి ఎవరైనా ప్రపపంచంలో ఉన్నారా? మోదీగారు! నిజమైన పనేమన్న ఉంటే ఆమెకు అప్పగించండి’ అంటూ ఒకరు...‘అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎందులోనూ ఆమె వేలుపెట్టకుండా, దానంతట అదే పనిచేసుకుపోయే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సుష్మా స్వరాజ్ ఎందుకు విఫలమయ్యారు. ఆమె సొంత ప్రభుత్వానికన్నా పాకిస్థాన్ పౌరులకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు’ అంటూ మరొకరు.. పాకిస్థానీ జాతీయులు షాబాజ్ బీబీ, జహీరుద్దీన్ బాబా, వజీర్ ఖాన్, ఇర్ఫాన్ ఆలి చాండియో తదితరులకు భారత్‌లో అవయవాల మార్పిడి కోసం వీసాలు మంజూరు చేస్తామంటున్న సుష్మా స్వరాజ్’ అంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘నరేంద్ర మోదీజీ! ఎలాంటి కారణం లేకుండానే మామ్ సుష్మాజీ నా ఖాతాను బ్లాక్ చేశారు. నాకేమైనా అవసరం పడితే నేను ఎవరిని ఆశ్రయించాలి? పాకిస్థాన్ పౌరులకు ఆమె వీసాలు ఇస్తే ఇచ్చారుగానీ ఇలా భారత పౌరులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?’ ఒకరు వ్యాఖ్యానించారు. ‘దేశీయ విధానాలను దృష్టిలో పెట్టుకొని విదేశీ విధానాలను రూపొందిస్తే ఏదోరోజు ఇలాంటిది జరుగుతుందని నాకు ముందే తెలుసు! అందుకని నా ఖాతాను అడ్డుకోవడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. 2014లో మార్పు కోసం మేము ఓటు వేసినందుకు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ మరొకరు విమర్శించారు. సుష్మా స్వరాజ్‌ను సున్నితంగా విమర్శిస్తూ ట్వీట్లు చేసిన వారంతా కూడా ఆమె పార్టీ భారతీయ జనతా పార్టీకి గట్టి మద్దతుదారులు. వారిలో కొంత మంది ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఫాలో అవుతున్నారు. భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకోవడానికి వీసా దొరక్క ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ జాతీయులకు సుష్మా ట్విట్టర్ ద్వారా స్పందించి వీసాలు ఇప్పించడం వారికి కోపం తెప్పించింది. ఆమెకు ట్విట్టర్లో 1.10 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
అనుపమ్‌ఖేర్‌కు పాక్ వీసా నిరాకరణ
కరాచీ సాహిత్య ఉత్సవాలకు 18 మందికి ఆహ్వానం * ఖేర్ దరఖాస్తు చేయలేదని వెల్లడి * వీసా తిరస్కరణకు నా దేశభక్తి కారణమా?: అనుపమ్ ప్రశ్నలు న్యూఢిల్లీ/కరాచీ: బాలీవుడ్ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు అనుపమ్ ఖేర్‌కు పాకిస్తాన్ వీసా నిరాకరించింది. పాక్‌లోని కరాచీలో శుక్రవారం నుంచి జరిగే కరాచీ సాహిత్య ఉత్సవం(కేఎల్ఎఫ్)లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు భారత్‌కు చెందిన అనుపమ్‌ఖేర్‌తో పాటు ప్రముఖ నటి నందితాదాస్, కాంగ్రెస్ నేత సల్మాన్‌ఖుర్షీద్ తదితర 18 మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఖేర్ మినహా మిగతా అందరికీ పాక్ వెళ్లడానికి గాను ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా మంజూరు చేసింది. అయితే.. ఖేర్ ఎలాంటి వీసా కోసం ఏ దరఖాస్తూ చేసుకోలేదని పాక్ ఎంబసీ పేర్కొంది. ఖేర్‌కు ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం తెలిసిందే. అందరికీ వీసా ఇచ్చి తనకు వీసా నిరాకరించటం చాలా విచారం, నిరుత్సాహం కలిగిస్తోందని ఆయన మంగళవారం అన్నారు. కశ్మీరీ పండిట్ అంశాన్ని లేవనెత్తటం, ప్రధాని మోదీకి మద్దతివ్వటం, దేశభక్తిపరుణ్ని కావటం వల్లే తనకు వీసా నిరాకరించారా? అన్నారు. ‘వారి ప్రదర్శనలకు భారత్‌లో ఒక చోట అభ్యంతరాలంటే.. మరొక చోటకు ఆహ్వానిస్తాం. కానీ అటువైపు నుంచి ఆ ప్రతిస్పందన లేదు’ అని అన్నారు. వీసా కోసం దరఖాస్తు చేయవద్దన్నారు: కేఎల్ఎఫ్ ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌ను సంప్రదించగా.. ఖేర్ వీసా కోసం తమకు దరఖాస్తు సమర్పించలేదని.. కాబట్టి ఆయనకు వీసా మంజూరు చేయటం లేదా నిరాకరించటం అనే దానికే ఆస్కారం లేదని హైకమిషన్ పేర్కొంది. కరాచీ సాహిత్య ఉత్సవ నిర్వాహకులు మాత్రం.. ఖేర్‌కు వీసా మంజూరు చేయబోమని, కాబట్టి ఆయనకు వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సలహా ఇవ్వాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ తమకు సూచించిందని చెప్పటం గమనార్హం. మతం, ఇండో-పాక్ సంబంధాలపై సామాజిక మాధ్యమాల్లో అనుపమ్ క్రియాశీలంగా స్పందిస్తుండటం వల్ల వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సూచించినట్లు పాక్వర్గాలు తెలిపాయి. తాను వీసా కోసం దరఖాస్తు చేయలేదని పాక్ హైకమిషన్ చెప్పటం పెద్ద జోక్ అని, అబద్ధమని ఆయన తప్పుపట్టారు. వీసా దరఖాస్తు లాంఛనాలను కరాచీలోని నిర్వాహకులే పూర్తిచేశారని చెప్పారు. ‘నాకు ఎందుకు వీసా నిరాకరించారో తెలియదు. నా దేశభక్తి వల్లా? నేను నా దేశం గురించి మాట్లాడతాను కనుకనా? నేను ఆ దేశానికి వెళ్లి నా దేశాన్ని విమర్శించననా? నేను ఉగ్రవాదుల భాషను మాట్లాడను’ అని అన్నారు. దీనిపై పాక్‌తో మాట్లాడాలని కేంద్రాన్ని కోరతానన్నారు. గత ఏడాది పాక్‌లో ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన ఖేర్‌కు అప్పడు కూడా పాక్ హైకమిషన్ వీసా నిరాకరించింది.