పాక్ చేతికి దొరికితే ఎలా హింసిస్తారంటే..?
ముంబయి: తన చేతులకు దొరికిన భారతీయుడిని పాకిస్థాన్ ఎన్ని రకాల చిత్ర హింసలు పెడుతుందో తెలిస్తే ఒళ్లు గగుర్లుపొడుస్తుంది. కులభూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష నేపథ్యంలో గతంలో పాక్ చేతులకు దొరికి నరకం అనుభవించి తిరిగి భారత్ చేరుకున్న సైనికుడు చందు చవాన్ కుటుంబ సభ్యులు ఆ వివరాలు తెలిపారు. సొంత కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని విధంగా పాకిస్థాన్ పోలీసులు జైలులో చిత్ర హింసలు పెడతారని తమ కుమారుడు చందు చెప్పినట్లు వివరించారు. చవాన్ గత ఏడాది సెప్టెంబర్ 29న అనుకోకుండా నియంత్రణ రేఖ దాటి వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అతడిని అదుపులోకి తీసుకుంది.
ఈ విషయం తెలిసి షాక్‌తో చవాన్ నాయనమ్మ లీలీ చిందా పాటిల్ గుండెపోటుతో చనిపోయింది. అయితే, భారత్ సంప్రదింపులు జరిపిన తర్వాత తిరిగి ఈ ఏడాది జనవరి 21న అతడు భారత్ చేరకున్నాడు. కానీ, అతడి ముఖంలో గతంలో ఉన్నంత కళ లేకుండా పోయింది. ముభావంగా మారిపోయాడు. తాను అనుభవించిన టార్చర్ షాక్‌లో నుంచి రెండు నెలలపాటు కోలుకోలేదు. డ్రగ్స్ కూడా అతడిపై ప్రయోగించి చిత్ర హింసలు పెట్టడంతో దాని ప్రభావం అతడిపై అప్పుడప్పుడు చూపడం ప్రారంభించింది. ఈ విషయాన్ని చందు తల్లిదండ్రులు పంచుకున్నారు.
‘చందు తిరిగొచ్చన తర్వాత మాకు కులభూషణ్ జాదవ్ కుటుంబం నుంచి ఫోన్ వచ్చింది. వారి వద్ద అతడు ఎక్కడ ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల మధ ఉన్నాడనే విషయంపై ఆధారాలు లేవు. సరిగ్గా కులభూషణ్ వీడియోను పాక్ విడుదల చేసిన రీతిలోనే చందును కూడా టార్చర్ చేశారు. ముందు చిత్ర హింసలు పెట్టి డ్రగ్స్ ఎక్కించి కేవలం తమకు మరణ శిక్ష విధించండి అనే మాట మాత్రమే నోట్లో నుంచి వచ్చేంత భయంకరంగా హింసించి అదే విషయాన్ని రికార్డు చేస్తారు.
తాము చెప్పిన మాటలే వీడియోలో చెప్పాలని బెదిరిస్తారు. అందుకే ఆ సమయంలో వారికి చావు అనే మాట తప్ప ఆ సమయంలో ఇంకే మాట రాదు. డ్రగ్స్ ఇచ్చిన తర్వాత చంపేయండి అనే మాట తప్ప తన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బందీగా ఉన్న వ్యక్తికి తెలియదు. ఇది మా కొడుకు చందూకు కలిగిన అనుభవం. అందుకే కులభూషణ్ కుటుంబ సభ్యులు అడిగితే చిత్రహింసల విషయం చెప్పవద్దని, సాధారణంగా విచారిస్తానని చెప్పమని నేను చెప్పాను. కానీ, వాస్తవానికి అక్కడ జరిగేది మాత్రం పూర్తిగా విరుద్ధం’ అని చందు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.