‘దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు వాస్తవమే’
సాక్షి, విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలపై పాలకమండలి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తవమేనని పాలకమండలి పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇటువంటి ఘటనల వల్ల భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ఆలయ ఈవో సూర్యకుమారి తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకే ఇటువంటి పూజలు నిర్వహించారని పాలకమండలి ఆరోపించింది. ఈవో సూర్యకుమారికి తెలిసే ఇదంతా జరిగిందని, ఆమె చెప్పడం వల్లే పూజలు, అలంకారం చేశామని బయట వ్యక్తులు చెబుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలో ఈవో ఘాట్రోడ్లోని పర్ణశాలలో హోమగుండాలు ఏర్పాటు చేసి క్షుద్రపూజలు చేశారని, ఆమె వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉందని పాలకమండలి ఆరోపణలు చేసింది.
ఆలయ ప్రతిష్టను ఈవో సూర్యకుమారి దిగజార్చారని, ఆలయంలో అర్థరాత్రి పూజలపై గత నెల 30న జరిగిన సమావేశంలో ప్రశ్నిస్తే ఆమె అన్నీ అబద్ధాలు చెప్పారని, అలాగే టెండర్ల విషయంలోనూ ఈవో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని పాలకమండలి చెప్పుకొచ్చింది. ఈవోపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బయటి వ్యక్తులు అంతరాలయంలోకి వెళ్లడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవో సూర్యకుమారి ప్రెస్మీట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.