పాలకొల్లు రైల్వేస్టేషన్ లో విషాదం
పాలకొల్లు సెంట్రల్: ఆప్తులందరినీ ఆత్మీయంగా పలకరించాడు.. అయిన వారికి టాటా చెప్పాడు.. మనసు ఒప్పక సంతోషం ఎక్కువై ఎక్కిన రైలు దిగి బంధువులకు మరోసారి వీడ్కోలు పలికాడు. ఇంతలో రైలు నెమ్మదిగా కదిలింది కంగారులో ఎక్కబోతూ కాలుజారి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రైలు కింద పడి మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన కట్టుంగ సోమశేఖర్(68) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు కాగా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నెల రోజులక్రితం అమలాపురానికి చెందిన అమ్మాయితో కుమారుడికి వివాహం జరిపించాడు. కోడలును హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు బుధవారం అమలాపురం వచ్చాడు. రోజంతా ఆనందంగా గడిపిన ఆయన ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించాడు.
గురువారం నరసాపురం–నాగర్సోల్ రైలులో హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా పాలకొల్లు రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. రైలు ఎక్కిన సోమశేఖర్ కిందకు దిగి జాగ్రత్తగా వెళ్లండని చెప్పాడని, ఇంతలో రైలు కదలడంతో కంగారుగా ఎక్కే క్రమంలో కాలుజారి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. భీమవరం రైల్వే ఏఎస్సై బి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. అప్పటివరకూ మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని రైల్వే పోలీసులు చెప్పారు.