అలనాటి ఆటపాటలు
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో మేనమరదలితో పెళ్లి ప్రస్తావించాడు. మేనరికాలు తెలుగువారిలో అనాది నుండి వస్తున్న ఆచారం. అదే గ్రంథంలో తిక్కన నాలుగు రోజుల పెళ్లిసంబరాల గురించి చెప్పాడు. ఈ రెండూ సంస్కృత మూలంలో లేవు. తెలుగువారి ఆచారాలే. ఇక తెలుగువాళ్ల పెళ్లిపండగ వర్ణన మొట్టమొదటిసారిగా కుమార సంభవంలో కనిపిస్తుంది. నన్నెచోడుడి కుమారసంభవంలో పార్వతీశివుల కల్యాణం వర్ణన ఇప్పటికి వెయ్యేళ్ల క్రితమే నాగవల్లి కుండలు, పాలకొమ్మతో రాటువేయడం, పసుపులు దంచడం, తలపై పేలాలు పెట్టడం, తెరపట్టడం, జీలకర్ర కలిపిన బియ్యం జల్లుకోవడం, ఊరేగింపు, వసంతాలు, బంతులాట మొదలైన మన పెళ్లి సంబరాలకి అద్దం పడుతుంది. అప్పటి పెళ్లిమంటపం డెకరేషన్ గురించి ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మచ్చుకి కరెంట్ లేని రోజుల్లో బయట ఎండలో అద్దాలు పెట్టి ఆ వెలుతురు పందిరి లోపల మంటపంలో పడేలా చేశారట!
తొలి చాళుక్యుల కాలంనాటి సాంఘిక పరిస్థితుల గురించి మహాభారతం, కుమార సంభవం, చాళుక్యసోమేశ్వరునిఅభిలాషితార్థచింతామణి, పండితారాధ్యుని బసవపురాణం మనకి ఎన్నో విషయాలు తెలుపుతాయి. నాచనసోముని ఉత్తరహరివంశంలో సత్యభామాకృష్ణుల నెత్తపుటాల(పాచికలు), ఆ ఆటకి సంబంధించిన పందేలూ, పంతాలు వర్ణిస్తుంది. పాచికలాట ఈనాటిది కాదు. అక్షక్రీడ ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. భారతయుద్ధానికి ముఖ్యకారణం పాచికలే. రాజసూయయాగం పాచికలాటతోగానీ పరిసమాప్తమవదు. ఆడవాళ్లు జోగిణి దేవతకి మొక్కి ఆట మొదలెట్టేవారని నాచన సోముడు చెప్పాడు. పూర్వం జైన విద్యాలయాల్లో ఎక్కాలు, లెక్కలు నేర్పేందుకు ఈ ఆటని ఉపయోగించారు.
ప్రహేళికలు, అంత్యాక్షరివంటివి వయసొచ్చిన ఆడపిల్లలు ఆడేవారని కుమార సంభవం చెబుతుంది. వాళ్ల ఆటల్లో పెద్ద సంబరంగా జరుపుకునేవి బొమ్మలపెళ్లి, గుజ్జనగూళ్లు, స్నేహితురాళ్లని ఒకచోట పోగేసి అట్టహాసంగా బొమ్మలకి పెళ్లి చేయటం, పిడతల్లో తాహత్తుకు తగినట్లు వంట చేసి పంచుకోవటం. ఇక బొమ్మల్లో ఎన్నో రకాలు ఆనాటి సాహిత్యంలో కనిపిస్తాయి. కుమార సంభవంలో దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరుల గురించి చెబితే నాచన సోముడు పుత్తడి లత్తుక బొమ్మలని గురించి చెప్పాడు. అచ్చనగుండ్లు, పికిలిపిట్లు, గీరనగింజలు, తన్నుబిళ్ల, కుచ్చెళ్లు, దాగిలిమూతలు, స్తంభాలాట, కుందుళ్లు లాంటివి ఇంట్లో ఆడితే, వీధిలో బొంగరాలు, బిళ్లంగోడు, చిడుగుడూ, కోలకోతులు ఆడేవాళ్లు.
అన్నింటిలో ముఖ్యమైనది మన తెలుగువారి క్రికెట్ ఆట. బిళ్లంగోడు, గిల్లీదండా, దండుగనీ, చిల్లగోడె, చిర్రాగోనె, ఇలా చాలా పేర్లున్నాయి. ఇప్పటికీ పల్నాడులో ఈ ఆట ఆడే పిల్లలు, ఏక్కా దుగా, తిక్కా అని ఒంట్లు లెక్కపెడతారు. అంటే బౌద్ధుల కాలానికే ఈ ఆట కోస్తాంధ్రలో ఆడేవారు. ఇక్కడ నుండే ఈ గిల్లీదండా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అయింది. మహారాష్ట్రలో ఈ ఆటని విటిదండు అంటారు. అక్కడ ఒంట్లు ఒకటీ, రెండూ, మూడు అని తెలుగుతో లెక్కబెడతారు. అందుకేనేమో మనవాళ్లకి క్రికెట్ ఆట అంత సులభంగా అలవడింది. ఇండియాకి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ మన తెలుగువాడే.. సి.కె.నాయుడు అనే కఠారి కనకయ్య నాయుడు. వేదవ్యాసుడి సంస్కృత భారతంలో కౌరవపాండవులతో ఆడించిన ఆట బంతాట కాదు. దానిని వీటాఖేలనం అన్నాడు.
‘వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్, హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా ప్రాక్షిపంతి’ అంటే, మూరెడు కర్రతో జానెడు బిళ్లని కొట్టే ఆట అని చెప్పాడు. కానీ ఎందుకో మన నన్నయ తెలుగు భారతంలో ఆ సన్నివేశాన్ని బంతాటగా మార్చాడు. పాపం, రాజమండ్రి వీధుల్లో కుర్రాళ్లు చేసే గోలకి గిల్లీదండా అంటే కోపమొచ్చిందేమో?