రా.. రాబందు
♦ పాలరపు సంరక్షణ కేంద్రంలో 30కి చేరిన సంఖ్య..
♦ రాబందులకు పశుమాంసం అలవాటు చేస్తున్న అటవీ అధికారులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. గతేడాది 19 పెద్ద రాబందులు, ఎనిమిది చిన్న రాబందులున్నట్లు గుర్తించిన అధికారులు, ఈ ఏడాది పెద్ద రాబందుల సంఖ్య 24కు పెరిగినట్లు తేల్చారు. చిన్నవి ఆరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వీటి ఆహారం అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నట్లు వారంటున్నారు. వేటా డే అలవాటు లేని రాబందులు చనిపోయిన జంతు కళేబరాలను మాత్రమే తిని జీవిస్తాయి. అయితే, వీటి సంరక్షణలో భాగంగా అధికారులు గతేడాది నుంచి రాబందులకు పశుమాంసాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసి, చంపి వాటిని రాబందుల స్థావరాల వద్ద పడేస్తున్నారు. రాబందులు ఆకలితో అలమటించకుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే, గతేడాది చేసిన ఈ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇలాంటి ప్రయత్నం చేయగా, ఈ మాంసాన్ని రాబందులు తినడం ప్రారంభించాయని రాబందుల సంరక్షణ ప్రాజెక్టు ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టు రవికాంత్ పేర్కొన్నారు.
పాలరపుగుట్ట స్థావరంగా..
ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ రేంజ్ పరిధి మొర్లిగూడ శివారులోని పాలరపు గుట్ట వద్ద రాంబందుల స్థావరాలను అటవీ శాఖ అధికారులు 2014లో గుర్తించారు. ఇక్కడ తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వీటి ఉనికి లేదు. కేవలం మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత-పెద్దవాగు సంగమం సమీపంలో మాత్రమే వీటి సంచారం ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని పొడవు ముక్కు రాబందుల సంరక్షణ (లాంగ్బిల్ట్ వల్చర్స్ కన్జర్వేటివ్) ప్రాజెక్టుగా 2015లో గుర్తించారు. ఎత్తై ఈ పాలరపు గుట్టలో రాబందులు గూడు కట్టుకునేందుకు వీలుగా సహజసిద్ధమైన బొయ్యారాలున్నాయి. సుమారు 40 వరకు ఈ బొయ్యారాలున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒక్కో గూటిలో ఒక్కో జంట రాబందులు నివాసముంటాయి.
ప్రస్తుతం 12 గూళ్లలో 24 రాబందులున్నట్ల్లు, ఆరింటిలో జంటలతో పాటు, ఒక్కో పిల్ల రాబందులున్నట్లు గుర్తించారు. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఇవి గుడ్లు పెడుతుంటాయి. జంట రాబందులు కలిసి ఈ గుడ్లను పొదిగితే పిల్లలు వస్తుంటాయి. ఆరు మాసాల్లో ఈ పిల్లలు బయటకు ఎగిరిపోతున్నాయి. వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ శాఖ ఈ కొండ చుట్టు కొంత భాగం ఫెన్సింగ్ వేశారు. వీటి కదలికలను గమనించేందుకు ఎత్తై మంచెను ఏర్పాటు చేశారు. నలుగురు ఫారెస్టు వాచర్లను, ఫీల్డ్ రీసెర్చ్ బయోలజిస్టును నియమించామని ఫారెస్టు రేంజ్ అధికారి మాడిచెట్టి రాంమోహన్ తెలిపారు. మొత్తానికి అంతరించిపోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.