పలాస జీడి..జిందాబాద్
జీఐ సాధనకు సహకరిద్దాం
పేరొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దాలి
దేశంలోనే పలాస జీడిపప్పు నెంబర్-1 పేటెంట్ హక్కు వస్తే రైతులకు, వ్యాపారులకు ప్రోత్సాహం
శ్రీకాకుళం : పలాస జీడిపప్పు పేరెత్తగానే నోరూరుపోతుంది. అలాంటి జీడిపప్పుకు ఇప్పుడు ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పేరొందిన ఐదు ఉద్యాన వన పంటలకు జీఐ మార్కు సాధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లా యంత్రాంగం, స్థానికులు, అధికారులు, వ్యాపారులు ఇప్పుడు పలాస జీడిపప్పుకు సంబంధించి మరోమారు గొప్పతనాన్ని చాటడం ద్వారా భవిష్యత్తులో మరో ట్రేడ్‌మార్క్ సాధించే అవకాశం ఉంది.
పేటెంట్ హక్కుల సాధనకు రాష్ట్రంలో పేరొందిన బంగినపల్లి మామిడి, చక్కెరకేళి అరటి, దుగ్గిరాల పసుపు, పలాస జీడిపప్పు, కర్నూలు ఉల్లికి సంబంధించి జీఐ (భౌగోళిక గుర్తింపు) సాధనకు ఉద్యానవనశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలొచ్చాయి. చెన్నైలో ఈ ఐదు రకాల గుర్తింపునకు రిజిస్ట్రేషన్ అవసరమై పలాస పరిధిలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎగుమతి, దిగుమతికే అవసరమైన పలాస జీడిపప్పుపై ఇప్పుడు ప్రత్యేక చర్చ అవసరమైంది. పలాస జీడిపప్పు పుట్టుకు ఇక్కడే అని నిరూపించుకుంటే దేశంలోనే నెంబర్-1అయ్యే పరిస్థితితోపాటు ట్రేడ్‌మార్క్ సాధనకు వీలుంటుంది. పేటెంట్ హక్కు పొందడం ద్వారా రైతులకు, వ్యాపారులకు మరింత లబ్ది చేకూరే అవకాశం ఉంది.
పలాస జీడిపప్పుకు డిమాండ్ ఉంది. పిక్కల నుంచి పప్పును వేరు చేసేందుకు పలాస ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక పద్ధతుల్ని ఉపయోగిస్తుంటారు. ఏళ్ల నుంచి ఈ పరిశ్రమ ఇక్కడ అలరారుతోంది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస (ఉద్దానం)ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30వేల మంది జీడిపరిశ్రమపై ఆధారపడుతున్నారు. పలాస క్యాష్యూ మేనుఫ్యాక్చరర్స్ పేరిట 500మంది వ్యాపారులున్నారు. మూడేళ్ల వ్యవధిలో జీడి మొక్క ఏపుగా పెరిగి పంటని స్తుంది. లక్షల ఎకరాల్లో జీడి పంట సాగవుతోం ది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి పన్నురూపంలో ఆర్థికంగా బలపడాలంటే పలా స జీడిపప్పునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడి వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు.
మనమేం చేయాలి?
జీడిపంట ఇక్కడే ప్రాధాన్యం అంటూ ఉద్యానవనశాఖ అధికారులు థృవీకరించాలి. ఈ పంట మూలాలు ఇక్కడే ఉన్నాయని పేర్కొనాలి. పంట విస్తీర్ణం, దిగుబడి లెక్కలు చూపించాలి. రైతులు పండిస్తున్న పంట ఫోటోలు పంపించాలి. పరిశ్రమ ఎదుగుతున్న తీరు కళ్లకు కనబడేలా గణాంకాలివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీడి పరిశ్రమ కష్టసుఖాల్ని వివరించాలి. జిల్లా యంత్రాంగం సహకారంతో తోటి వ్యాపారులు, స్థానిక నేతల ఆధ్వర్యంలో త్వరలోనే ఉద్యాన వన శాఖ అధికారులకు పలాస జీడిపప్పు ప్రత్యేకతపై ఓ నివేదిక సమర్పిస్తామని ‘ది పలాస క్యాష్యూ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ కార్యదర్శి మళ్ల సురేష్ కుమార్ ‘సాక్షి’కి చెప్పారు.