సెంచరీ దొంగ మళ్లీ చిక్కాడు...
బన్సీలాల్‌పేట్: వృద్ధులకు మాయమాటలు చెప్పి బంగారు నగలు ఎత్తుకెళ్తున్న ఓ పాతనేరస్తుడ్ని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4 లక్షల విలువ చేసే 14 తులాల బంగారు వస్తువులు, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం...రహమత్‌నగర్‌కి చెందిన పల్లి బాబూరావు(51) పాతనేరస్తుడు. మహంకాళి పోలీసులు 1995లో 110 చోరీ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. సుమారు నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన బాబూరావు బయటకు వచ్చాక మళ్లీ చోరీ చేస్తున్నాడు.
వృద్ధులు, మహిళలు టార్గెట్...
ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న వృద్ధులు, మహిళలను కలిసి అనాథ పిల్లలకు డొనేషన్లు ఇవ్వాలని, రుణాలు ఇప్పిస్తానని చెప్పి మాటల్లోకి దించుతాడు. తర్వాత ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, మెడలోని బంగారు నగలు తీసి దాచుకోమని చెప్తాడు. పట్టుబట్టి మరీ బాధితులతో నగలు తీయిస్తాడు. వాటిని కాగితంలో చుట్టి బ్యాగ్‌లో పడుతున్నట్టు నటించి కాజేస్తాడు. నిందితుడు బాబూరావు బోయిన్పల్లి, అంబర్‌పేట, చిలకలగూడ, కాచిగూడ, హయాత్‌నగర్, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇలా చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిపై 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అడిషినల్ డీసీపీ రామ్మోహన్రావు, చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య పర్యవేక్షణలో గాంధీనగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి , ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.