వైఎస్ జగన్‌ను కలిసిన ఆయిల్ ఫాం రైతులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయిల్ ఫాం రైతులు కలిశారు. దుద్దుకూరులో చింతమనేని హనుమంతరావు ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిసి ఆయిల్ ఫాం సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు తెలిపారు. క్రూడ్ పామాయిల్‌పై 12.5 శాతం దిగుమతి పన్ను విధించారని, అయితే పామాయిల్ టన్నుకు మద్దతు ధర రూ.7,494 మాత్రమే ఇస్తున్నారన్నారు.
టన్ను పామాయిల్ మద్దతు ధర రూ.10వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా వైఎస్ జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులకు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం కుక్కునూరులో పర్యటించనున్నారు. పోలవరం నిర్వాసితుల రిలే దీక్షకు వైఎస్ జగన్ మద్దతు పలకనున్నారు.