పామా‘యిల్లే’!
- అస్తవ్యస్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ
- నిలిచిపోయిన పామాయిల్ సరఫరా
- ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో ఏమో
- అయోమయంలో లబ్ధిదారులు
తిరుపతిక్రైం, న్యూస్‌లైన్: ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అమ్మహస్తం సరుకుల్లో ఇప్పటికే కోత పడగా తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో పూర్తిగా పామాయిల్ అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మే నెలకు రేషన్ డీలర్లు పామాయిల్‌కు డబ్బు కట్టాల్సిన అవసరం లేదని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లక్షల 86 వేల 450 మంది కార్డుదారులకు పామాయిల్ అందే పరిస్థితి కనిపించడంలేదు.
తిరుపతి అర్బన్ మండలానికి గత నెలకు 62 వేల లీటర్ల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉండగా 59 వేల 556 లీటర్లను మాత్రమే సరఫరా చేశారు. మే నెలకు సంబంధించి రేషన్ డీలర్లకు పామాయిల్‌కు డీడీలు కట్టరాదని ముందస్తుగానే సివిల్ సప్లయ్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్నికల హడావిడిలో పడి అధికారులు పామాయిల్ సరఫరాను పూర్తిగా విస్మరించారు. పామాయిల్ లీటర్ ధ ర 63.50 పైసలు ఉండగా కేంద్ర ప్రభుత్వం 23.50 పైసలు సబ్సిడీ ఇస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు రూ.40 చొప్పున లీటర్ పామాయిల్ ప్యాకెట్‌ను పంపిణీ చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా ఏప్రిల్ నెలలో పామాయిల్ సరఫరా ఆగిపోయింది. ఇక మేనెలకు డీడీలు కట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చాకే..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పామాయిల్ సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పామాయిల్ సబ్సిడీ విషయం గవర్నర్ దృష్టికి వెళ్లినా స్పందనలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక దీన్ని పునరుద్ధరిస్తారో.. లేదో వేచిచూడాల్సిందే.