palm tree leaves
-
Sagubadi: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి!
తాటాకు బుట్టలు బత్తాయి కాయలకు చుట్టడం, రసాయనిక ఎరువులకు బదులు చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం ద్వారా బత్తాయి సాగులో యువ రైతు కడసాని రవీందర్‌రెడ్డి బహుళ ప్రయోజనాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని తోపుచర్ల గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి మూడు ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రసాయనిక ఎరువులు వాడి భూమి నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో రవీందర్ రెడ్డి రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పిందె దశ నుంచే చీడపీడల బారి నుంచి పంటను కాపాడేందుకు అనేక రకాల రసాయనిక పురుగు మందులను బత్తాయి రైతులు పిచికారీ చేస్తుంటారు. రవీందర్ రెడ్డి మందుల జోలికి పోకుండా తాటాకు బుట్టలను కాయలకు తొడుగుతున్నారు. తద్వారా పేనుబంక, మంగు, దోమ తదితర చీడపీడల నుంచి కాయలను కాపాడుకోగలుగుతున్నారు. కాయ సైజు పెరగటం, బంగారు పసుపు రంగులోకి మారటం వల్ల కొనుగోలుదారులు ఈ కాయలను ఇష్టపడి అధిక ధర చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ఇలా చేస్తే అధిక లాభాలు! బత్తాయి రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మాడుగులపల్లి ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి సూచిస్తున్నారు. సేంద్రియ సాగులోకి మళ్లటంతో పాటు కాయలకు తాటాకు బుట్టలు తొడిగే పద్ధతిని ఆచరిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. మాడుగులపల్లి నుంచి బత్తాయిలను తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్లకు తరలిస్తుంటారు. అక్కడ కాయ రూ. 20–25లకు అమ్ముతున్నట్లు సమాచారం. బత్తాయి కాయలకు తొడిగే తాటాకు బుట్టలను సైతం రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. బుట్ట ఖరీదు రూ.5. రవాణా, కూలి ఖర్చులతో కలిపి బుట్టకు మొత్తం రూ.8 ఖర్చవుతున్నదని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. వేములపల్లి మండలంలోని మొల్కపట్నంలో కూడా మరో ఇద్దరు బత్తాయి రైతులు తాటాకు బుట్టలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 20–22 టన్నుల దిగుబడికి అవకాశం గతంలో రసాయనిక ఎరువుల వాడినప్పుడు ఎకరానికి బత్తాయి పండ్ల దిగుబడి 13–15 టన్నుల వరకు వచ్చేది. చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం వల్ల కాయల సంఖ్యతో పాటు కాయ సైజు గణనీయంగా పెరిగింది. ఈసారి ఎకరానికి 20–22 టన్నుల దిగుబడి వస్తుందనుకుంటున్నా. తాటాకు బుట్టల వాడకం వల్ల తెగుళ్లు సోకటం లేదు. కాయ బంగారు పసుపు రంగులోకి మారి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నది. – కడసాని రవీందర్ రెడ్డి, బత్తాయి రైతు, ఫోన్: 9392990998, తోపుచర్ల, మాడుగులపల్లి మం. నల్లగొండ జిల్లా – పండుగ శ్రీనివాస్, సాక్షి, మాడుగులపల్లి, నల్లగొండ జిల్లా చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ -
తాటాకులతో ఆహ్వాన పత్రికలు
చెన్నై, అన్నానగర్: వినూత్న రీతిలో తాటాకులతో ఆహ్వాన పత్రికలు, ఇంటి ఉపకరణాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు మదురై జిల్లాకు చెందిన స్వామినాధన్. రాష్ట్రపు చెట్టు అయిన తాటి చెట్టు నుంచి ముంజలు, కళ్లు, కరుపట్టి వంటి వస్తువులు తయారుచేస్తారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన స్థితిలో అరటి ఆకు, గుడ్డ సంచులు, తాటి ఆకులతో చేసిన వస్తువులు ఉపయోగం ఎక్కువైంది. ఎలుమలై సమీపంలో ఉన్న రామనాధపురం గ్రామానికి చెందిన స్వామినాధన్ (30). ఇతను ఎంసీఏ చదివి బ్యాంకులో పనిచేసేవాడు. ప్రస్తుతం స్వామినాథన్ తాటి ఆకులతో పలు గృహోపయోగ వస్తువులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. తాటి ఆకులతో బుట్టలు, పెట్టెలు, ప్రత్యేక బుట్టలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. దీంతో పాటు వివాహం కోసం దండలు, తోరణాలు వంటి వస్తువులను తాటి ఆకులతో తయారు చేస్తున్నాడు. వివాహం, ఆహ్వాన పత్రికలను అచ్చు కొడుతూ వస్తున్నాడు. విజిటింగ్ కార్డు కూడా తయారుచేస్తాడు. స్వామినాథన్ మాట్లాడుతూ.. తాటి ఆకులతో వస్తువు తయారీపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్నట్లు తెలిపాడు. స్వయంగా వ్యాపారం చేసే దాంట్లో తృప్తిగా ఉంటుందని, దీంతోపాటు కొంత మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వవచ్చని చెప్పారు. తాటి ఆకుల వస్తువులను ఉపయోగిస్తే ప్లాస్టిక్ అనర్థాలను కూడా తగ్గించవచ్చని చెప్పాడు. ఫ్రిడ్జ్‌లో కూరగాయలను పెట్టకుండా తాటి ఆకు బుట్టల్లో పెడితే 2, 3 రోజుల వరకూ కూరగాయలు చెడిపోకుండా ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై అందరూ అవగాహన కలిగి ఉంటే, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపాడు. -
కమ్మని కళాఖండాలు
ఎండాకాలం వస్తే.. విసనకర్రలతో విసురుకునేవారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేవారు. ఇవన్నీ ఒకనాటి రోజులు.. ఫ్యాన్లు, ఏసీలు వచ్చాక విసనకర్రలు అదృశ్యమయ్యాయి. ఇప్పుడవే తాటి కమ్మలతో దేవతామూర్తుల కిరీటాలు తయారవుతున్నాయి. సంప్రదాయ బొమ్మలు రూపొందుతున్నాయి. వాటికి అవసరమైన బొమ్మ కమ్మలు కొత్తవలస మండలం నుంచే ఎగుమతి అవుతున్నాయి. వియ్యంపేట పంచాయతీ కొటానవాని పాలెంకి చెందిన కొమ్మాది సూరిబాబు కుటుంబం బొమ్మ కమ్మల తయారీతో ఉపాధి పొందుతోంది. కొత్తవలస రూరల్ : కొమ్మాది సూరిబాబు కుటుంబం ఇరవయ్యేళ్లుగా బొమ్మ కమ్మలను తయారు చేస్తూ కోల్కత్తా, చెన్నై నగరాలకు ఎగుమతి చేస్తోంది. సూరిబాబు మంచి క్రికెట్, కబడ్డీ క్రీడాకారుడు కూడా. విశాఖ జిల్లా కండిపల్లి, రాజాగూడెం, విజయనగరం జిల్లా కొటానివానిపాలెం, బల్లంకి, శ్రీకాకుళం జిల్లా దొడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తదితర ప్రాంతాలు బొమ్మ కమ్మల తయారీకి ప్రసిద్ధి చెందాయి. వీటిని కోల్కత్తా, చెన్నై నగరాల్లో సంప్రదాయ బొమ్మల తయారీలో వినియోగిస్తారు. దేవతామూర్తుల కిరీటాలను తయారు చేస్తారు. దళారుల బెడద గిరాకీ ఉన్న బొమ్మ కమ్మల తయారీలో భార్యాబిడ్డలతో సహా శ్రమిస్తున్నా గిట్టుబాటు రావడం లేదు. మధ్యవర్తులే లాభాలు దోచుకుంటున్నారు. మొదటి నుంచి ఇదే పని నమ్ముకోవటంతో వదల్లేక అరటి మట్టలు, ఉపాధి పనులు చేసుకుంటున్నాం. వేసవిలో కమ్మ దొరక్కపోతే ఉపాధి పనులు, మామిడి పండ్ల విక్రయంతో కాలక్షేపం చేస్తున్నాం. అరటి తొండాలను కూడా తెచ్చి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటాం. – సూరిబాబు బొమ్మ కమ్మలు ఎలా చేస్తారంటే.. మెక్క తాటిచెట్ల నుంచి లేత తాటాకుల్ని స్థానికులు కొట్టి తెచ్చి వీరికి అమ్ముతారు. ఒక్కొక్క మోపులో వెయ్యి ఆకులుంటాయి. వీటిని సూరిబాబు కుటుంబం రూ.400కు కొంటుంది. వీటిని ఒకటి లేదా రెండు రోజులు ఆరబెడతారు. వాటిని ఇద్దరు బొమ్మ కమ్మలుగా కత్తిరిస్తారు. వాటిని మర్నాడు వంగిపోకుండా మడతబెడతారు. వెయ్యికమ్మలు ఒక మూటగా కట్టి విశాఖ జిల్లా వేపగుంట సమీపంలోని సింహాద్రినగర్ వ్యాపారి లారీల్లో లోడ్ చేస్తారు. అక్కడి నుంచి కోల్కత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు. -
తాటాకు బుట్టల్లో చికెన్!
కేకే నగర్: మార్కెట్ నుంచి చికెన్ ఎలా తెచ్చుకుంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. సంచులతో అని తెలియదా అంటారా. పల్లెటూర్ల అయితే గిన్నెల్లో కూడా తెచ్చుకుంటారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తాటాకు బుట్టల్లో కోడిమాంసం తెచ్చుకుంటున్నారు. తిరునల్వేలి జిల్లా కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధం విధించడంతో వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా తాటాకు బుట్టల్లో కోడిమాంసం విక్రయిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం రోజున ప్రజల నుంచి ప్లాస్టిక్ వస్తువులను అధికారులు తీసుకునే పద్ధతిని కార్పొరేషన్ అధికారులు పరిచయం చేశారు. మిగతా రోజుల్లో జరిమానా వసూలు చేస్తున్నారు. మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాళయంకోట ఎస్పీ కార్యాలయం ఎదురుగా దుకాణాల్లో తాటాకు బుట్టల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందుకు తిరుచెందూర్ సమీపంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో తాటాకు బుట్టలను వ్యాపారులు కొంటున్నారు. దీనిపై మాంసం దుకాణం యజమాని రజాక్ మాట్లాడుతూ కార్పొరేషన్ చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ చర్యలకు వ్యాపారులు సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా తాటాకు బుట్టల్లో మాంసం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లలో మాంసం గంట దాటితే చెడిపోయే అవకాశం ఉందని, అదే తాటాకు బుట్టలో ఆరు గంటల సేపు చెడిపోకుండా ఉంటుందని తెలిపారు. తాటాకు బుట్టల ద్వారా కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.