నేటి నుంచి చండీరుద్ర మహాయాగం
♦ 12 ఏళ్ల పాటు కొనసాగనున్న మహత్కార్యం
♦ వంచవటి క్షేత్రంలోప్రారంభించనున్న కాశీనాథ్బాబా
న్యాల్కల్: మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులో మంజీర నది సమీపంలో వెలసిన పంచవటి క్షేత్రంలో కుంభమేళ ఉత్సవాలు నిర్వహించిన పీఠాధిపతి కాశీనాథ్బాబా మరో మహత్కార్యాన్ని తలపెట్టారు. దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని పుష్కర కాల చండీరుద్ర మహాయాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగా పండి దేశప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ ఈ యాగాన్ని తలపెట్టినట్టు కాశీనాథ్బాబా చెప్పారు. 12 సంవత్సరాలు పాటు(2028 మార్చి 28 వరకు) ఏకదాటిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
పంటలు పండక, దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న ప్రజల క్షేమం కోసం ఈ యాగాన్ని 36 లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహామునులు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయని కాశీనాథ్బాబా తెలిపారు. గతంలో రాజులు ఇ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘట నలు ఉన్నాయన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని క్షేత్రం ఆవరణలో యజ్ఞాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
హాజరుకానున్న ప్రముఖులు
కార్యక్రమానికి వివిధ ప్రాంతాల పీఠాధిపతులు, రుషులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. నేడు బీదర్ సిద్దరూడ మఠం పీఠాధిపతి శివకుమార్స్వామి, తమ్లూర్ పీఠాధిపతి సద్గురు శివానంద శివాచార్యస్వామి, 9న అంతర్గామ పీఠాధిపతి ఏకాంబ గజేంద్ర కరుణ్ మహారాజ్, 10న బిచుకుంద సంస్థానం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్, 11న అనంతగిరి సరస్వతి క్షేత్రం పీఠాధిపతి అష్టావధాని అష్టకాల నర్సింహ రామశర్మ, 12న శ్రీ వేంకటస్వామి మహారాజ్తో పాటు బర్దీపూర్, కుప్పానగర్, రాయగిరి, అంగడిపేట, కొండాపూర్, ముంగి, కమలాపురం మఠాల పీఠాధిపతులు దత్తగిరి మహారాజ్, మల్లికార్జునస్వామి, బసవలింగ మల్లయ్య గిరి మహారాజ్, శ్రీవాసుదేదానంద సరస్వతి స్వామి, సచ్చిదానంద ఉద్దవ మహారాజ్, సంగ్రాం మహారాజ్, దేవగిరి మహారాజ్ తదితరులు యాగంలో పాలుపంచుకోనున్నారు. ముఖ్య అథితులుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డి తదితరులు వస్తారని కాశీనాథ్బాబా చెప్పారు. కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నారు.