రేప్ చేసిన వ్యక్తిని కాళ్లు పట్టించి వదిలేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికి రెండోసారి అన్యాయం జరిగింది. ఆమెపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందిపోయి కేవలం బాధితురాలి కాళ్లు పట్టించడం ద్వారా అతడిని వదిలేశారు. అనంతరం ఈ ఘటన ఇక మరిచిపొమ్మంటూ బాధితురాలిని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలి జిల్లాలో గల ఓ గ్రామపంచాయితీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల వితంతువుపై గత నెల జనవరి 28న లైంగికదాడి జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఆ గ్రామ పెద్ద ఆమెను ఆపి కేసు ముందుకు వెళ్లనివ్వకుండా స్టేషన్ బయటే పంచాయతి నిర్వహించాడు. నిందితుడితో బాధితురాలి కాళ్లను పట్టించి వదిలేశాడు. ఇకపై ఈ ఘటనపై నోరు మెదపవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.