సంక్షేమ పథకాలు పేదల దరిచేరేలా చూస్తా
-పీఆర్అండ్ఆర్డీ నూతన డెరైక్టర్
- బాధ్యతలు స్వీకరించిన నీతూకుమారి ప్రసాద్
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను చిట్టచివరి లబ్దిదారునికి కూడా సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డెరైక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. పీఆర్అండ్ఆర్డీ విభాగానికి నూతన డెరైక్టర్‌గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. పీఆర్అండ్ఆర్డీతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లకు సీఈవోగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం నీతూప్రసాద్ కే అప్పగించింది. నూతన బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆమెసాక్షి’తో మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయంగా ముందుకు తీసికెళ్లేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. ప్రధానంగా.. ఇటీవల జిల్లాల పునర్విభజన ప్రక్రియతో ఏర్పడిన కొత్త జిల్లాల్లో శాఖాపరమైన సమస్యలున్నాయని, వాటి పరిష్కారంపై ముందుగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ సరిపడినంత సిబ్బంది లేకపోవడం, డీఆర్డీఏలో డ్వామా సంస్థను విలీనం చేసి ఆయా జిల్లాల ప్రాజెక్ట్ డెరైక్టర్లను డీఆర్డీవోలుగా నియమించడం, వారికి వేతనాలు ఏ పద్దు నుంచి చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడం.. వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే, సెర్ప్‌లో పనిచేస్తున్న సుమారు 4వేల మంది ఉద్యోగులకు రెండు నెలలుగా వేతన సవరణ బకాయిలు అందలేదని, రెండు మూడ్రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధిహామీ పనులు మెరుగ్గా జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి కేటాయించిన మొత్తం పనిదినాలు డిసెంబరులోగానే ఖర్చుకానున్నాయన్నారు. అదనపు పనిదినాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీలైనన్ని ఎక్కువ పనిదినాలు మంజూరయ్యేలా కృషిచేస్తానని నీతూ ప్రసాద్ చెప్పారు. దాదాపు 36లక్షలమంది ఆసరా పథకం లబ్దిదారులకు సకాలంలో పింఛన్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతానన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఇతర విభాగాలు కూడా తనవద్దే ఉన్నందున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సమన్వయం లేమికి అవకాశం ఉండదన్నారు. మొత్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసేందుకు కృషిచేస్తానన్నారు. నిస్తేజంగా ఉన్నచోట దూకుడుగా వ్యవహరిస్తానని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు.