‘ఈ-పంచాయతీ’ ఉత్తమాటేనా?
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సాంకేతిక విప్లవంతో పల్లెసీమలను అభివృద్ధి పథంలో నడపడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణలో విఫలమవుతున్నాయి. గ్రామపంచాయతీలు పురోగతికి దూరంగానే ఉంటున్నాయి. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఇతర నిధులు, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్ ఇనిస్ట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్వేర్ ఉత్తదే కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఈ-పంచాయతీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఆచరణ సాధ్యం కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, స్థానికంగా అవగాహన లేకపోవడంతో చాలా గ్రామాల్లో కంప్యూటర్లు ఉత్తవిగానే ఉంటున్నాయి. పలు పంచాయతీల సిబ్బంది ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
బిల్లులు చెల్లించకపోవడంతో..
జిల్లాలోని 718 పంచాయతీలకు గానూ 74పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చారు. వీటికి అవసరమైన కంప్యూటర్లను కొనుగోలు చేసి, బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ల ద్వారా ఆన్లైన్ కనెక్షన్లను తీసుకున్నారు. ఇందులో చాలా పంచాయతీలు టెలిఫోన్ బిల్లును చెల్లించక పోవడంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పంచాయతీ సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కార్యదర్శులు ప్రైవేటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, ఇంటర్ నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పంచాయతీ సమాచారాన్ని ఏరోజుకు ఆరోజు ఆన్లైన్లో ఉంచాలి. జిల్లాలోని 74 ఈ-పంచాయతీలలో కేవలం 20 పంచాయతీలలో మాత్రమే కంప్యూటర్లు పని చేస్తున్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సాంకేతిక విప్లవం తీసుకరావాలన్న ప్రభుత్వ ఆలోచన మంచిదైనా ఆచరణలో విఫలమవుతుండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
‘నూతన’ పాలకవర్గాలైనా..
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పం చ్లలో చాలామంది విద్యావంతులు, యువకులు ఉ న్నారు. వీరైనా ఈ-పంచాయతీల అమలును పకడ్బం దీగా చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నా రు. పంచాయతీ నిధుల నుంచి కంప్యూటర్లను కొనుగోలు చేసి, మిగతా పంచాయతీలలో కూడా ప్రియా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని కోరుతున్నారు. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాలు పంచాయతీల్లో కొత్తదనం తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.