పంచాయతీ అక్రమాలపై విచారణ
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న అక్రమాలపై డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. పంచాయతీ కార్యదర్శి ఒమర్ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించా రు. వ్యాపారి జాఫర్‌ఖాన్ 2004లో పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గది కోసం చెల్లించిన రూ.50వేలు జమ కాలేదని, మార్కెట్ కమిటీ చెల్లించిన పన్ను రూ.38,748 డీడీ సిబ్బంది వాడుకున్నారని, పంచాయతీ కార్యదర్శి అనుమతి లేకుండా ఓ ఇంటి పేరు మార్చారని, షాపింగ్ కాంప్లెక్స్ డిపాజిట్ రూ.లక్ష వివరాలు లేవని, వీటితోపాటు పలు అంశాలపై కార్యదర్శి ఫిర్యాదు మేరకు విచారణ సాగింది.
గతంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ రాజ్‌కుమార్, బిల్‌కలెక్టర్ సుధాకర్‌లను పిలిపించి విచారణ జరిపారు. సర్పంచ్ కోవ లక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అంటున్నారని చేసిన ఫిర్యాదుపైనా విచారణ చేశారు. విచారణకు సర్పంచ్ కోవ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఒమర్ హాజరయ్యారు. తనపై అట్రాసిటీ కేసు బనాయిస్తానని సర్పంచ్ బెదిరించారని, ఇక్కడ తాను పని చేయలేనని కార్యదర్శి ఒమర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి సర్పంచ్ లక్ష్మిని వివరణ కోరగా.. గిరిజన మహిళా సర్పంచ్ కావడంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ వివరాలు జిల్లా పంచాయతీ అధికారికి నివేదిస్తామని డీఎల్పీవో తెలిపారు.