రాష్ట్రంలో 13 వేల శ్మశానవాటికల అభివృద్ధి
అవనిగడ్డ : రాష్ట్రంలోని 13 వేల శ్మశానవాటికలను (ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున) అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న వంతెన, రహదారి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,500 పంచాయతీల్లో ఒక్కోదానికి రూ.15 లక్షలతో గ్రామ సచివాలయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు పంచాయతీలు 30 శాతం నిధులు సమకూర్చుకుంటే మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల గృహాలకు ఇంకా మరుగుదొడ్లు లేవని, 2019 నాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ నిర్వహించే గ్రామాలకు నిధుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4,500 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల నిర్మాణం పూర్తికాగా, మరో 2,600 కిలోమీటర్లలో నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఇంకో 2,400 కిలోమీటర్ల మేర సీసీ రహదారులను నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తొలుత రూ.27.5 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి చింతకాయల ప్రారంభించారు. కార్యక్రమంలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, స్వచ్ఛభారత్ మిషన్ రాష్ట్ర అంబాసిడర్ డాక్టర్ సీఎల్ రావ్ తదితరులు పాల్గొన్నారు.