Pandigai
-
నా కేరీర్లో ముఖ్యమైన చిత్రం పండిగై
తమిళసినిమా: యువ నటుడు కృష్ణ విజయానందంలో తేలిపోతున్నారు. చిన్న గ్యాప్ తరువాత పండిగై చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. నటి విజయలక్ష్మి నిర్మాతగా మారి తన భర్త ఫిరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం పండిగై. కృష్ణకు జంటగా ఆనంది నటించిన ఈ చిత్రానికి ఆర్‌హెచ్.విక్రమ్ సంగీతాన్ని అందించారు. గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో ఆ సంతోషాన్ని చిత్ర కథానాయకుడు కృష్ణ సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఫిరోజ్ తనకు చిరకాల మిత్రుడన్నారు. ఆయన కొన్ని యదార్థ సంఘటనలతో తయారు చేసిన కథతో తెరకెక్కించిన చిత్రం పండిగై అని తెలిపారు. ప్రేమ, సెంటిమెంట్‌తో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలతో తనకు యాక్షన్ హీరో అంతస్తును అందించిన చిత్రం పండిగై అని చెప్పారు. ఇది తన సినీ కెరీర్లోనే చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కళుగు, యామిరుక్క భయమేన్ చిత్రాలు చేసే సమయంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ పండిగై చిత్రం నటిస్తున్నప్పుడు అలాంటి భావనే కలిగిందన్నారు. ఈ చిత్రంలో తనతో నటించిన ఆనంది చాలా రాశి గల నటి అని, ఈ చిత్రంతో ఆమె ఖాతాలో మరో విజయం చేరిందని అన్నారు. అదే విధంగా నటుడు సవరణన్ పండిగై చిత్రం తరువాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెలిగిపోతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే నటుడు నితిన్ సత్యకు మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన నటి విజయలక్ష్మి తనకు మంచి స్నేహితురాలని, ఆమె ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారని తెలిపారు. టోటల్ చిత్ర యూనిట్ శ్రమకు దక్కిన విజయం పండిగై అని కృష్ణ పేర్కొన్నారు. -
నేను సాఫ్టే అయితే..
తమిళసినిమా: నిజానికి నేను సాఫ్టే అయితే..అంటోంది నటి ఆనంది. అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈ భామ తమిళ చిత్రాలతోనే బిజీగా ఉంది. కయల్ చిత్రంతో కమల్ ఆనందిగా మారిన ఈ అమ్మడు ఒక పక్క చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటూనే మరో పక్క ఎంబీఏ పట్టభద్రురాలవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆనందిని పలకరిస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చింది. అవేంటో ఆమె మాటల్లోనే..కథానాయకిగా బిజీగా ఉన్నా ఎంబీఏ పూర్తి చేయడానికి ఇటీవలే ఫస్ట్ ఇయర్లో చేరాను. ఇక సినిమాల గురించి చెప్పాలంటే కృష్టకు జంటగా నటించిన పండిగై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో నా పాత్ర చాలా చలాకీతనంతో అలరిస్తుందన్నారు. నేను తెలుగు నటినైనా తమిళ భాషను బాగా మాట్లాడగలుగుతున్నాను. కొన్ని చిత్రాలకు నేను డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తదుపరి దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్న పరియోరం పెరుమాళ్ అనే చిత్రంలో నటిస్తున్నాను. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నాను. చాలా బాగా నటిస్తున్నావని పా.రంజిత్ అభినందించడం సంతోషంగా ఉంది. ఎన్ ఆలోడ చెరుప్పు కానోం చిత్రం కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించాను. ఇందులో పసంగ పాండి కథానాయకుడు. నాకు కయల్ చిత్రం ద్వారా అవకాశం కల్పించిన దర్శకుడు ప్రభుసాలమెన్ నిర్మిస్తున్న రూపాయ్ చిత్రంలో ఇడ్లీ కొట్టు నడుపుకునే పేద అమ్మాయిగా నటిస్తున్నాను. దీనికి అన్భళగన్ దర్శకుడు. ఈ చిత్రంలో నాకు మేకప్పే ఉండదు. విమల్‌కు జంటగా మన్నార్ వగైయరా చిత్రం చేస్తున్నాను. అదే విధంగా సీవీ.కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో కలైయరసన్‌కు జంటగా నటిస్తున్నాను. ఆనంది చాలా సాఫ్టా అని అడుగుతున్నారు. నిజానికి నేను చాలా సాఫ్టే. అయితే ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అబద్దాలు చెప్పినా చాలా కోపం వస్తుంది. -
నటనకు అనుమతించారు కానీ..!
తమిళసినిమా: తాను హీరోయిన్ అవుతానని అన్నప్పుడు కుటుంబసభ్యులు సమ్మతించడంతో పాటు, మద్దతుగా నిలిచారని, అయితే చిత్రాన్ని నిర్మిస్తానన్నప్పుడు మాత్రం తన కుటుంబసభ్యులతో పాటు చాలా మంది వద్దని నిరుత్సాహపరిచారని నటి విజయలక్ష్మీ పేర్కొన్నారు. చెన్నై–28 చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె తాజాగా నిర్మాత అవతారమెత్తి తన భర్త ఫెరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పండగై అనే చిత్రం నిర్మిస్తున్నారు. కృష్ణ, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సరవణన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిన క్రమంలో పండిగై చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత నటి విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు కృష్ణ తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రం కోసం ఎంతగానో శ్రమించారని, కేరవన్కు కూడా వెళ్లకుండా చాలా కష్టపడి నటించారని పేర్కొన్నారు. అదే విధంగా చిత్ర సాంకేతిక వర్గం పోటీ పడి మరీ చిత్రం బాగా రావాలని అహర్నిశలు పని చేశారని చెప్పారు. ఇప్పుడు ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసిన ఆరా సినిమా అధినేత మహేశ్ ఇప్పుడు తమకంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల తరువాత మరో నాలుగు చిత్రాలను నిర్మించాలన్న కోరిక కలుగుతోందని విజయలక్ష్మీ తెలిపారు. ఎవరూ ముందుకు రాలేదు ఈ చిత్ర కథను చాలా మందికి చెప్పానని, అందరూ బాగుందని అన్నా నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో తామే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చిత్ర దర్శకుడు ఫెరోజ్ తెలిపారు. ఇందులో కృష్ణ, ఆనంది, సవరణన్లను నటింపజేయాలనుకున్నామని, అది సాధ్యం అయ్యినందుకు సంతోషం కలిగిందన్నారు. ఇది వీధి పోరాట ఇతివృత్తంతో కూడిన చిత్రం కావడంతో ఫైట్స్‌కు ప్రాముఖ్యత ఉంటుందని, స్టంట్‌మాస్టర్ అన్భరివు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారని తెలిపారు. చిత్రం చూడకుండానే నమ్మకంతో చాలా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.