నేను సాఫ్టే అయితే..
తమిళసినిమా: నిజానికి నేను సాఫ్టే అయితే..అంటోంది నటి ఆనంది. అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈ భామ తమిళ చిత్రాలతోనే బిజీగా ఉంది. కయల్ చిత్రంతో కమల్ ఆనందిగా మారిన ఈ అమ్మడు ఒక పక్క చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటూనే మరో పక్క ఎంబీఏ పట్టభద్రురాలవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆనందిని పలకరిస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చింది. అవేంటో ఆమె మాటల్లోనే..కథానాయకిగా బిజీగా ఉన్నా ఎంబీఏ పూర్తి చేయడానికి ఇటీవలే ఫస్ట్ ఇయర్‌లో చేరాను.
ఇక సినిమాల గురించి చెప్పాలంటే కృష్టకు జంటగా నటించిన పండిగై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో నా పాత్ర చాలా చలాకీతనంతో అలరిస్తుందన్నారు. నేను తెలుగు నటినైనా తమిళ భాషను బాగా మాట్లాడగలుగుతున్నాను. కొన్ని చిత్రాలకు నేను డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తదుపరి దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్న పరియోరం పెరుమాళ్ అనే చిత్రంలో నటిస్తున్నాను. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నాను. చాలా బాగా నటిస్తున్నావని పా.రంజిత్ అభినందించడం సంతోషంగా ఉంది.
ఎన్ ఆలోడ చెరుప్పు కానోం చిత్రం కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించాను. ఇందులో పసంగ పాండి కథానాయకుడు. నాకు కయల్ చిత్రం ద్వారా అవకాశం కల్పించిన దర్శకుడు ప్రభుసాలమెన్ నిర్మిస్తున్న రూపాయ్ చిత్రంలో ఇడ్లీ కొట్టు నడుపుకునే పేద అమ్మాయిగా నటిస్తున్నాను. దీనికి అన్భళగన్ దర్శకుడు. ఈ చిత్రంలో నాకు మేకప్పే ఉండదు. విమల్‌కు జంటగా మన్నార్ వగైయరా చిత్రం చేస్తున్నాను. అదే విధంగా సీవీ.కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో కలైయరసన్‌కు జంటగా నటిస్తున్నాను. ఆనంది చాలా సాఫ్టా అని అడుగుతున్నారు. నిజానికి నేను చాలా సాఫ్టే. అయితే ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అబద్దాలు చెప్పినా చాలా కోపం వస్తుంది.