పీఎన్‌బీఎస్‌కు రాజధాని కళ
బస్టాండ్‌లోనే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కార్యాలయం
పరిపాలన భవనంపై నాలుగు అంతస్తుల నిర్మాణానికి అవకాశం
ఇటీవలే పరిశీలించిన ఎండీ సాంబశివరావు
బస్‌భవన్‌కు చేరిన పీఎన్బీఎస్ మాస్టర్ ప్లాన్
విజయవాడ : నగరంలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్(పీఎన్బీఎస్) రాష్ట్ర రాజధాని శోభ సంతరించుకోనుంది. రాజధాని స్థాయికి తగినట్లు అభివృద్ధి చేయటంతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారుల కార్యాలయాలు కూడాఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. ప్రధానంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ కార్యాలయాన్ని పీఎన్‌బీఎస్‌లోనే ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ భవనాలతోపాటు ఖాళీ స్థలాలను ఇటీవల అధికారులు పరిశీలించారు. ఎండీ కార్యాలయంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు మే నెలలోపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మార్పులు, చేర్పుల కోసం బస్టాండ్‌కు సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు పంపారు.
అన్ని విధాలా అనుకూలం..
హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్ కన్నా ముందుగా 1990-91లోనే విజయవాడలో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌ను 26.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 4.3 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ బస్ డిపో ఉంది. మిగిలిన విస్తీర్ణంలో బస్టాండ్‌లోని పరిపాలన కార్యాలయం, ఎరైవల్ బ్లాక్‌లు, ప్లాట్‌ఫారాలు, బస్‌ల పార్కింగ్ ప్రాంతం, ద్విచక్ర వాహనాల స్టాండ్, సుమారు 110 షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బస్టాండ్‌లోని పరిపాలన కార్యాలయాలన్నీ మొదటి అంతస్తులోనే ఉన్నాయి. కింది భాగంలో బస్సుల ఎరైవల్ బ్లాక్ ఉంది. భవన నిర్మాణ సమయంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. ప్రస్తుతం జీ ప్లస్ వన్‌గా ఉన్న బస్టాండ్ భవనాన్ని జీ ప్లస్ 5గా మార్చుకునేందుకు వీలుగా నిర్మించారు. దీంతో ఇక్కడే ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో గడచిన రెండు వారాల్లో ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు రెండుసార్లు పీఎన్‌బీఎస్‌ను తనిఖీ చేశారు. పరిపాలన భవనంపైన అదనపు అంతస్తుల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
నూతనంగా నాలుగు అంతస్తులు నిర్మిస్తే ఎంత విస్తీర్ణం వస్తుంది.. పరిపాలనా కార్యాలయానికి ఎంత వినియోగించుకోవచ్చు.. అనే అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బస్టాండ్ మాస్టర్‌ప్లాన్‌ను హైదరాబాద్‌లోని ఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం బస్టాండ్ మొదటి అంతస్తులోని పరిపాలన భవనం సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిపై మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తే దాదాపు 80 వేల చదరపు అడుగులకు విస్తీర్ణం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 500 మందికి పైగా సిబ్బంది పనిచేసేందుకు కార్యాలయాలు, 50 మందికిపైగా అధికారులకు చాంబర్లు ఏర్పాటుచేయవచ్చని తెలుస్తోంది. అయితే, ఎండీతోపాటు ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం గతంలో విద్యాధరపురం బస్ డిపో, చల్లపల్లి బంగ్లా సమీపంలోని పాత బస్టాండ్ ప్రాంగణాలను కూడా పరిశీలించారు.
400 మందికి పైగా వచ్చే అవకాశం...
ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో 350 నుంచి 400 మంది సిబ్బంది ఉంటారు. వీరితోపాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, ఎనిమిది మంది రీజనల్ మేనేజర్ స్థాయి అధికారులు, కీలకమైన అడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ విభాగాలు కూడా ఇక్కడే ఉంటాయి. వీటిలో ఆర్ఎం స్థాయి అధికారులతోపాటు డీవీఎం, డీఎం స్థాయి అధికారులు, ఇతర ఉన్నతాధికారులు 35 మంది వరకూ ఉంటారు. వీరందరూ మే నెలలోపు నగరానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.