వైఎస్సార్ సీపీ నేతలపై బాంబుదాడి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ నాయకులపై తెలుగుదేశం నేతలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నారుు. మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన లింగారెడ్డి వెంకటరామిరెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పాపాయపాలెం గ్రామానికి చెందిన 14 మంది సత్తెనపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనంపై టీడీపీ గ్రామ నేతలు, కార్యకర్తలు బాంబుల వర్షం కురిపించారు.
దీంతో వారు వాహనాన్ని అతివేగంగా గ్రామంలోకి తీసుకెళ్లారు. ప్రత్యర్థులు బాంబులు విసురుతూ వెంబడించారు. గ్రామంలో ప్రజలు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఈ దాడిలో వాహనంపై ఐదు బాంబులు, రోడ్డుపై ఒక బాంబు పడ్డాయి. వాహనం అద్దాలు పగిలి గుచ్చుకోవడంతో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మర్రి అచ్చిరెడ్డి, వాహనాన్ని నడుపుతున్న రఫీ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లునాయక్, పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, బెల్లంకొండ ఎస్ఐ మురళి, మాచవరం ఎస్ఐ హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోన్లో పార్టీ అధినేత జగన్ పరామర్శ
విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పాపాయపాలెంలో బాంబుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికివస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజాసంక్షేమం మరచి ఇలాంటి దుశ్చర్యలకు దిగడం సరికాదన్నారు. తమ సమస్యల్ని బాధితులు, గ్రామస్తులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చేత బాధితులతో ఫోన్లో మాట్లాడించారు. ఎంపీటీసీ సభ్యుడు వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ మర్రి ప్రసాదరెడ్డి తమ సమస్యలను జగన్మోహన్రెడ్డికి వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
జెడ్పీటీసీ సభ్యుడి అక్రమ అరెస్టు వైఎస్సార్ సీపీ నేతలు, ఎమ్మెల్యేల నిరసన
పిడుగురాళ్ల: అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌కు అడ్డుతగులుతున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీకి చెందిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డిపై అక్రమ కేసులు బనారుుంచి అరెస్టు చేరుుంచిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి తదితరులు గురువారం పిడుగురాళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్లోను, జైలువద్ద ధర్నా చేశారు.
బాంబుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాలో బాంబుల విష సంస్కృతిని మళ్లీ ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాపాయపాళెం గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ వారు బాంబుదాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.