Paper Company
-
Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్ చేసింది!
సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్ గుప్తా. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనమిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్.. తరువాత ఎమ్బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్ స్కాట్లాండ్లో స్థిరపడడంతో పూనమ్ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్లాండ్లో అయినా జాబ్ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది. అలా వచ్చిన ఆలోచనే... ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్‌కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్‌ను రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్ వ్యర్థాలను కొని రీసైక్లింగ్ చేసేది. రీసైక్లింగ్ అయిన తరువాత నాణ్యమైన పేపర్‌ను తయారు చేసి విక్రయించడమే పూనమ్ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్‌ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి. పూనమ్‌కు అండగా... పీజీ పేపర్స్‌ని పూనమ్ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్‌గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో అనతి కాలంలోనే పీజీ పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్ ట్రేడింగ్ కంపెనీతోపాటు డెంటల్ హెల్త్ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్ రాణిస్తోంది. అందరూ అదర్శమే... ‘‘నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’. – పూనమ్ గుప్తా -
పేపర్ పరిశ్రమ ఆదాయంలో క్షీణత
న్యూఢిల్లీ: అమ్మకాలు పెరిగినప్పటికీ పేపర్ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 8–10 శాతం మేర క్షీణించొచ్చని ప్రమఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. తీవ్ర పోటీ కారణంగా నికర ప్రయోజనం తగ్గొచ్చని పేర్కొంది. క్రితం ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద అమ్మకాల పరిమాణం 5–7 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్ ఆరోగ్యకరంగా 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే అయినా, కరోనా ముందున్న నాటి 17 శాతం కంటే ఎక్కువేనని వివరించింది. దీంతో స్థిరమైన నగదు ప్రవాహాలు ఉంటాయని తెలిపింది. 2022–23లో పేపర్ పరిశ్రమ రికార్డు స్థాయిలో 30 శాతం ఆదాయ వృద్ధిని చూడడం గమనార్హం. 87 పేపర్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ నివేదికను విడుదల చేసింది. పేపర్ పరిశ్రమలో సగం ఆదాయం ఈ కంపెనీల చేతుల్లోనే ఉంది. ప్యాకేజింగ్ పేపర్ వాటా మొత్తం మార్కెట్లో 55 శాతంగా ఉంది. ఆ తర్వాత రైటింగ్, ప్రింటింగ్ (డబ్ల్యూపీ) పేపర్ వాటా 30 శాతంగా ఉంది. మిగిలినది న్యూస్ ప్రింట్, స్పెషాలిటీ పేపర్. ప్యాకేజింగ్ పేపర్‌ను ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్ గూడ్స్, కన్జన్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, రెడీమేడ్ విభాగాలు ఉపయోగిస్తుంటాయి. విద్యా రంగం, కార్పొరేట్ రంగం డబ్ల్యూపీ పేపర్‌ను ఉపయోగిస్తుంటుంది. డిమాండ్ ఇలా.. ప్యాకేజింగ్ పేపర్ అమ్మకాల పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. డబ్ల్యూపీ పేపర్ అమ్మకాల పరిమాణం 3–5 శాతమేర పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం వ్యయాలకు తోడు, నూతన వి ద్యా విధానం ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. అలాగే, 2024 సాధారణ ఎన్నికల ముందు డబ్ల్యూపీ పేపర్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. -
సుబాబుల్ బకాయి రూ.11 కోట్లు
కర్ర అమ్మి నెలలు దాటుతున్నా అందని సొమ్ము ఆందోళనలో సుబాబుల్ రైతులు నవాబుపేట (పెనుగంచిప్రోలు) : పేపర్ కంపెనీలకు సుబాబుల్ కర్ర అమ్మి నెలలు దాటుతున్నా ఇంతవరకూ డబ్బు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నవాబుపేటలో నందిగామ ఏఎంసీ పరిధిలోని ఎస్పీఎం, ఏపీపీ, ఐటీసీ కంపెనీలకు చెందిన సుబాబుల్ డంపింగ్ కేంద్రాలు ఉన్నాయి. పేపర్ కంపెనీలు టన్ను సుబాబుల్‌కు రూ.4,400 చెల్లిస్తున్నాయి. ఏపీపీ, ఐటీసీ కంపెనీల వారు రైతుల నుంచి కర్ర కొనుగోలు చేసిన 15 నుంచి నెలరోజుల లోపు సొమ్ము చెల్లిస్తుంటే, ఎస్పీఎం(సిర్పూర్ పేపర్ మిల్) మాత్రం ఏప్రిల్ నుంచి ఇంత వరకూ రైతులకు డబ్బు చెల్లించలేదు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఈ కంపెనీ రైతులకు చెల్లించాల్సిన సొమ్ము సుమారు రూ.11 కోట్ల వరకూ ఉందని అన్నదాతలు చెబుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులకు వడ్డీ చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. నందిగామ, జగ్గయ్యపేటల్లో సుమారు 60వేల ఎకరాల్లో సుబాబుల్ సాగవుతుండగా, ఒక్క నవాబుపేటలోనే రెండు వేల ఎకరాల వరకూ సాగులో ఉంది. కొందరు రైతులు ఏఎంసీతో సంబంధం లేకుండా టన్నుకు రూ.700 ఇన్సెంటివ్‌తో కంపెనీకి నేరుగా కర్రను అమ్మారు. దీనికి సంబంధించి ఎస్పీఎం రూ.50లక్షల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉంది. దీని గురించి సంబంధిత సూపర్వైజర్ను అడిగితే కంపెనీ నుంచి డబ్బు రాలేదని సమాధానం చెబుతున్నారని రైతులు అంటున్నారు. దీనికి తోడు సన్నకర్ర కొనక పోవడంతో ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కోల్పోతున్నామని, అలాగే కర్రను కాటాల వద్దకు తెచ్చిన వెంటనే తీసుకోకపోవడంతో అరుగుదల ఏర్పడి తరుగు వస్తోందని, దీనివల్ల కూడా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఎస్పీఎం కంపెనీ రైతులకు చెల్లించాల్సిన డబ్బు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాని కోరుతున్నారు. దీనిపై నందిగామలోని ఎస్పీఎం కంపెనీ ప్రతినిధి రామును వివరణకోరగా.. కంపెనీలో పేపర్ నిల్వలు పెరగడంతోపాటు, సాంకేతిక సమస్యల వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.2 కోట్లు ఇచ్చామని, నెలాఖరుకు మరో రూ. కోటి ఇస్తామని చెప్పారు. సెప్టెంబరులో మరో రూ.5కోట్లు ఇచ్చేందుకు అంగీకారం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం సొమ్మును అక్టోబరులో ఇచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని వివరించారు. అలాగే కంపెనీకి నేరుగా కర్ర అమ్మిన రైతులకు సంబంధించి రూ.50లక్షలు సెప్టెంబరు 5,6 తారీఖుల్లో డబ్బు చెల్లిస్తామన్నారు. వడ్డీకి తెచ్చాం.. నాలుగు ఎకరాల్లోని సుమారు 110 టన్నుల కర్రను ఏప్రిల్ 10 నుంచి 18 వరకు కొట్టించి, కంపెనీ యార్డుకు తరలించాం. ముందుగా రూ.50 వేల వరకు పెట్టుబడి అయింది. ఐదు నెలలు అయినా డబ్బు చెల్లించలేదు. సొమ్ము వస్తుందనే అప్పులు చేశాం. -గరిమిడి శ్రీనివాసరావు, సుబాబుల్ సాగు రైతు వ్యవసాయాధారిత పంటగా గుర్తించాలి సుబాబుల్‌ను వ్యవసాయాధారిత పంటగా గుర్తించాలి. లేకపోతే రైతు నష్టపోతున్నాడు. ఇలా చేస్తే ధరలో వ్యత్యాసాలు గానీ, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం విషయంలో, బీమాకు సంబంధించి రైతుకు భరోసా ఉంటుంది. -గింజుపల్లి రవికుమార్, డీసీఎమ్ఎస్ డైరక్టర్