- కర్ర అమ్మి నెలలు దాటుతున్నా అందని సొమ్ము
- ఆందోళనలో సుబాబుల్ రైతులు
నవాబుపేట (పెనుగంచిప్రోలు) : పేపర్ కంపెనీలకు సుబాబుల్ కర్ర అమ్మి నెలలు దాటుతున్నా ఇంతవరకూ డబ్బు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నవాబుపేటలో నందిగామ ఏఎంసీ పరిధిలోని ఎస్పీఎం, ఏపీపీ, ఐటీసీ కంపెనీలకు చెందిన సుబాబుల్ డంపింగ్ కేంద్రాలు ఉన్నాయి. పేపర్ కంపెనీలు టన్ను సుబాబుల్‌కు రూ.4,400 చెల్లిస్తున్నాయి.
ఏపీపీ, ఐటీసీ కంపెనీల వారు రైతుల నుంచి కర్ర కొనుగోలు చేసిన 15 నుంచి నెలరోజుల లోపు సొమ్ము చెల్లిస్తుంటే, ఎస్పీఎం(సిర్పూర్ పేపర్ మిల్) మాత్రం ఏప్రిల్ నుంచి ఇంత వరకూ రైతులకు డబ్బు చెల్లించలేదు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఈ కంపెనీ రైతులకు చెల్లించాల్సిన సొమ్ము సుమారు రూ.11 కోట్ల వరకూ ఉందని అన్నదాతలు చెబుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులకు వడ్డీ చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.
నందిగామ, జగ్గయ్యపేటల్లో సుమారు 60వేల ఎకరాల్లో సుబాబుల్ సాగవుతుండగా, ఒక్క నవాబుపేటలోనే రెండు వేల ఎకరాల వరకూ సాగులో ఉంది. కొందరు రైతులు ఏఎంసీతో సంబంధం లేకుండా టన్నుకు రూ.700 ఇన్సెంటివ్‌తో కంపెనీకి నేరుగా కర్రను అమ్మారు. దీనికి సంబంధించి ఎస్పీఎం రూ.50లక్షల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉంది. దీని గురించి సంబంధిత సూపర్‌వైజర్‌ను అడిగితే కంపెనీ నుంచి డబ్బు రాలేదని సమాధానం చెబుతున్నారని రైతులు అంటున్నారు.
దీనికి తోడు సన్నకర్ర కొనక పోవడంతో ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కోల్పోతున్నామని, అలాగే కర్రను కాటాల వద్దకు తెచ్చిన వెంటనే తీసుకోకపోవడంతో అరుగుదల ఏర్పడి తరుగు వస్తోందని, దీనివల్ల కూడా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఎస్పీఎం కంపెనీ రైతులకు చెల్లించాల్సిన డబ్బు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాని కోరుతున్నారు. దీనిపై నందిగామలోని ఎస్పీఎం కంపెనీ ప్రతినిధి రామును వివరణకోరగా.. కంపెనీలో పేపర్ నిల్వలు పెరగడంతోపాటు, సాంకేతిక సమస్యల వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.2 కోట్లు ఇచ్చామని, నెలాఖరుకు మరో రూ. కోటి ఇస్తామని చెప్పారు. సెప్టెంబరులో మరో రూ.5కోట్లు ఇచ్చేందుకు అంగీకారం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం సొమ్మును అక్టోబరులో ఇచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని వివరించారు. అలాగే కంపెనీకి నేరుగా కర్ర అమ్మిన రైతులకు సంబంధించి రూ.50లక్షలు సెప్టెంబరు 5,6 తారీఖుల్లో డబ్బు చెల్లిస్తామన్నారు.
వడ్డీకి తెచ్చాం..
నాలుగు ఎకరాల్లోని సుమారు 110 టన్నుల కర్రను ఏప్రిల్ 10 నుంచి 18 వరకు కొట్టించి, కంపెనీ యార్డుకు తరలించాం. ముందుగా రూ.50 వేల వరకు పెట్టుబడి అయింది. ఐదు నెలలు అయినా డబ్బు చెల్లించలేదు. సొమ్ము వస్తుందనే అప్పులు చేశాం.
-గరిమిడి శ్రీనివాసరావు, సుబాబుల్ సాగు రైతు
వ్యవసాయాధారిత పంటగా గుర్తించాలి
సుబాబుల్‌ను వ్యవసాయాధారిత పంటగా గుర్తించాలి. లేకపోతే రైతు నష్టపోతున్నాడు. ఇలా చేస్తే ధరలో వ్యత్యాసాలు గానీ, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం విషయంలో, బీమాకు సంబంధించి రైతుకు భరోసా ఉంటుంది.
-గింజుపల్లి రవికుమార్, డీసీఎమ్‌ఎస్ డైరక్టర్