కళేబరం వెలికితీత
- సుగర్స్ కార్మికుడు శ్రీనివాసరావుదిగా గుర్తించిన తల్లి
- డిఎన్ఏ పరీక్షలకు పంపిన పోలీసులు
- ఫ్యాక్టరీ యాజమాన్యంపై సర్వత్రా ఆగ్రహం
చోడవరం: గోవాడ చక్కెరమిల్లు స్ప్రేపాండ్ డ్రైనేజీలో లభ్యమైన కళేబరం ఆ గ్రామానికి చెందిన పప్పల శ్రీనివాసరావు(30)గా కుటుంబసభ్యులు నిర్ధారించారు. కళేబరాన్ని పోలీసులు శ నివారం వెలికితీసి చోడవరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దానికి ఉన్న దుస్తులు ఆధారంగా తల్లి చెల్లయ్యమ్మ పరిశీలించి కళేబరం తన కుమారుడు శ్రీనివాసరావుదిగా గుర్తించింది.
దీంతో రెండ్రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కళేబరాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్టు ఎస్ఐ రమణయ్య తెలిపారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మిస్టరీగానే ఉంది. రెండునెలల కిందట క్రషింగ్ జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికుడు స్ప్రేపాండ్ తొట్టెలో ఎలా పడ్డాడు. ఇంత కాలంగా మృతదేహం అక్కడే ఉన్నా ఎవరూ ఎందుకు కనిపెట్టలేకపోయారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.
ఫ్యాక్టరీలోకి ఎవరు వెళుతున్నారు,ఎప్పుడు వెళుతున్నారు, విధుల అనంతరం ఎంతమంది వస్తున్నారనే వివరాలపై సరైన నిఘా లేదనే విమర్శలు చోటుచేసుకున్నారు. ఇందువల్లే మిల్లు హౌస్ వెనుక ఉన్న స్ప్రేపాండ్, దాని పరిసరాల్లో ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నా సకాలంలో వెలుగుచూడటంలేదనే వాదన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా కనిపించకుండా పోయిన కొడుకు ఇలా కళేబరమై కనిపించడాన్ని తల్లి చెల్లయ్యమ్మ, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. ఇంటికి ఆధారంగా ఉన్న కొడుకు ఇలా అకాలంగా మృతిచెందడంలో ఆ వృద్ధురాలు తనకు ఇక దిక్కెవరంటూ రోదిస్తోంది. కేసు దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ రమణయ్య తెలిపారు.