అత్యంత ధనికుడైన కార్పొరేటర్ ఎవరో తెలుసా?
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగర పాలక సంస్థ.. బీఎంసీ దేశంలోనే అత్యంత ధనికమైన కార్పొరేషన్. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులలో బీజేపీకి చెందిన పరాగ్ షా తనకు ఏకంగా రూ. 690 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. దాంతో ఈసారి పోటీ చేసిన అభ్యర్థులందరిలోకీ ఆయనే బాగా ధనవంతుడిగా తేలారు. బీఎంసీ ఎన్నికల్లో ఆయన 132వ నెంబరు వార్డులో గెలిచారు కూడా. ఆయన ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రవీణ్ ఛద్దాను ఓడించి మరీ ఆయన కార్పొరేటర్ అయ్యారు. సాధారణంగా ఘట్కోపర్, ములుంద్ ప్రాంతాల్లో గుజరాతీలు, జైన్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి చోట పరాగ్ గెలవడం పెద్ద విశేషమే అంటున్నారు. మన్ కన్స్ట్రక్షన్స్, మన్ డెవలపర్స్ పేరుతో సొంత సంస్థలున్న ఆయన.. ముంబైతో పాటు గుజరాత్లో కూడా పలు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు.
ఇక పరాగ్ చేతిలో ఓడిన ప్రవీణ్ ఛద్దా కూడా సామాన్యుడు ఏమీ కాదు. ప్రస్తుత బీఎంసీలో ప్రతిపక్ష నేత. అలాంటి వ్యక్తిని ఓడించడం బీజేపీకి మంచి ప్రతిష్ఠాత్మక విజయం అయ్యింది. పరాగ్ లాంటి బలమైన అభ్యర్థి అయితేనే విజయవకాశాలు ఉంటాయని భావించిన బీజేపీ.. ఆయనను బరిలోకి దించింది. అఫిడవిట్ ప్రకారం ముంబై, థానేలలో పరాగ్ షాకు 9 ఆస్తులున్నాయి. థానెలో ఒక ఫ్లాట్ విలువే 8 కోట్లు.