టీటీడీ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం నెలకొంది. వేంకటేశ్వర స్వామి పరకామణి లెక్కింపు బాధ్యతను ప్రైవేట్ పరం చేసేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. పరకామణి సేవలో దేవస్థానం ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడంతోనే దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
టీటీడీ ఉద్యోగులు పరకామణి లెక్కింపుకు ఆసక్తి చూపకపోవడంతో.. 2012లో దేవస్థానం భక్తుల కోసం పరకామణి సేవను ప్రారంభించింది. అప్పటి నుంచి కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీవిరమణ చేసిన ఉద్యోగులను పరకామణి సేవలకు టీటీడీ వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో పరకామణిని ప్రైవేటీకరణ చేయాలని దేవస్థానం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ప్రైవేటు ఏజెన్సీల జోక్యం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పరకామణి సేవపై టీటీడీ నిర్ణయాన్ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అలిపిరి భద్రతను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని, ఇపుడు పరకామణి సేవ కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారి పరకామణి సేవలో పాల్గొనడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని, అలాంటి వారిని పరకామణి సేవకు దూరం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.