paralisis
-
పక్షవాత బాధితునికి ఏఐ సాయం... అతనిలో వచ్చిన వినూత్న మార్పు ఇదే..
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇంతకాలం అసాధ్యాలనుకున్నవన్నీ ఏఐ సాయంతో సుసాధ్యాలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అటువంటి మరో ఉదంతం ఇప్పుడు అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.స్విట్టర్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పక్షవాతానికిగురైన ఒక వ్యక్తికి అత్యుత్తమ చికిత్సనందించారు. బాధితుని శరీరంలోని కిందిభాగం పక్షవాతానికి గురికాగా, శాస్త్రవేత్తలు ఆ భాగం బాధితుని నియంత్రణలోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే 2011లో పక్షవాతానికి గురైన గర్ట్-జైన్ ఓస్కమ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏఐ సాయంతో తిరిగి నడవగలుగుతున్నాడు. తనకు చికిత్స అందించిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. 40 ఏళ్ల ఓస్కమ్ తన ఆలోచనల ద్వారా ఇప్పుడు తన శరీరభాగాలను నియత్రించగలుగుతున్నాడు. రెండు ఇంప్లాట్స్ కారణంగా ఇది సంభవమయ్యింది. బాధితుని మెదడు- వెన్నెముకకు మధ్య తిరిగి కనెక్షన్ ఏర్పరచడం ద్వారా బాధితుని శరీర భాగాలు అతని అదుపులోకి వచ్చాయి. ఓస్కమ్ మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి నడుస్తానని ఎప్పుడూ అనుకోలేదని,శాస్త్రవేత్తలు తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకుల బృందం ఓస్కామ్ మెదడుకు, వెన్నెముకకు మధ్య ఒక డిజిటల్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది.ఈ బ్రిడ్జి బాధితుడు అన్ని ఆటంకాలు అధిగమించి నడించేందుకు సహకరిస్తుంది. 2011లో జరిగిన ఒక ప్రమాదం అనంతరం ఓస్కమ్ పక్షవాతానికి గురయ్యాడు. ఆ తరువాత నుంచి వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏఐ సాయం, శాస్త్రవేత్తల కృషితో బాధితుడు తిరిగి నడవగలుగుతున్నాడు. -
సాహసయాత్ర: ఒంటి కాలితో సైకిల్ మీద 3,700 కిమీ
తిరువనంతపురం: మన మీద మనకు నమ్మకం.. గట్టి సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి పోరాడవచ్చు. సాధించాలనే తపన నీకుంటే.. విధి సైతం నీ ముందు తలవంచి తప్పుకుంటుంది అంటారు కార్య సాధకులు. ఈ మాటలను నిజం చేసి చూపాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పక్షవాతం వచ్చి కుడి కాలు చచ్చు బడింది. దాంతో ఉద్యోగం కోల్పోయాడు. అయినా అతడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంగ వైకల్యాన్ని పక్కకు పెట్టి.. ఒంటి కాలితో సైకిల్ తొక్కుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లా చేరాలని భావించాడు. లద్ధాఖ్ నుంచి మొదలు పెట్టి 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంగ వైకల్యం అతడికి అడ్డంకిగా మారలేదు. అతడి ప్రయాణం.. పయనం ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. కేరళ, త్రిసూర్‌కు చెందిన మహ్మద్ అశ్రఫ్ కొన్నేళ్లుగా దుబాయ్‌లో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తూండేవాడు. సాపీగా సాగిపోతున్న అతడి జీవితంలో 2017లో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. పెద్ద ప్రమాదానికి గురయ్యాడు మహ్మద్.. ఫలితంగా పక్షవాతం వచ్చి అతడి కుడి కాలు పడిపోయింది. దాంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘2017లో బైక్ యాక్సిడెంట్ అయ్యింది. 9 ఆపరేషన్లు చేశారు. ఏళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీటన్నింటిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం గతేడాది, ఏప్రిల్‌లో పర్వతాలు ఎక్కడం ప్రారంభించాను. దాంతో నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. పర్వతారోహణతో ప్రేమలో పడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ ప్రయాణంలో నా లోపమే నా సామర్థ్యం అని తెలిసి వచ్చింది. దాంతో మనిషి తల్చుకుంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాలనుకున్నాను. నేను కుంగిపోయి ఉంటే.. మంచానికే పరిమితం అయి ఉండేవాడిని. కానీ నేను అలా ఉండాలని కోరుకోలేదు. సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలనుకున్నాను. అందుకే ఈ సాహసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు. ‘‘17,582 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లాను సైకిల్ మీద చేరుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి 11 రాష్ట్రాలు దాటాను. రోజుకు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు ఓ మడతపెట్టగలిగే ఓ టెంట్, నిద్ర పోవడానికి ఉపయోగించే ఓ బ్యాగ్ తీసుకుని జర్నీ ప్రారంభించాను. రాత్రి పూట పెట్రోల్ బంకుల్లో నిద్రపోయేవాడిని’’ అని తెలిపారు. ‘‘ఈ ప్రయాణంలో నాకు ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. 1000 కిలోమీటర్లు ప్రయాణించి త్రిసూర్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాను. నా ప్రయాణం గురించి తెలిసి నాకు ఆహారం, బస ఏర్పాటు చేశారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటాను’’ అన్నాడు. కృత్రిమ కాలు అమర్చుకోవచ్చు కదా అంటే.. ‘‘మూడేళ్లు ఆస్పత్రిలో ఉండే సరికి నా కుటుంబం పొదుపు చేసిన మొత్తం ఖర్చయ్యింది. ఈ టూర్ పూర్తయ్యాక డబ్బులు పోగేసి.. సర్జరీ చేయించుకుని.. కృత్రిమ కాలు పెట్టించుకుంటాను’’ అని తెలిపాడు మహ్మద్. -
జన్యు చికిత్సతో పక్షవాతానికి చెక్
లండన్ : పక్షవాత బాధితులకు ఊరటగా మెరుగైన చికిత్సా పద్ధతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించే క్రమంలో జన్యు చికిత్స వేలాది బాధితులకు వరంగా మారనుంది. జీన్ థెరఫీ ద్వారా పక్షవాత రోగులు చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు, భుజాలపై తిరిగి నియంత్రణ సాధించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎలుకలపై పరిశోధకులు చేపట్టిన అథ్యయనం సానుకూల ఫలితాలను ఇవ్వడంతో జన్యు చికిత్స ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అంచనా వేస్తున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన న్యూరోసర్జన్ల బృందం చేపట్టిన ఈ అథ్యయనంలో పక్షవాత చికిత్సలో మేలి మలుపు వంటి అంశాలను గుర్తించారు. ఇక వెన్నుపూస గాయాలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందిపడే వారికి ఆయా అవయవాల్లో తిరిగి కదలిక రావడం అసాధ్యమవుతున్న క్రమంలో తాజా అథ్యయన వివరాలు చికిత్సా పద్ధతులను కొత్తపుంతలు తొక్కిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. పక్షవాతం, వెన్నుపూస గాయాలతో ఇబ్బంది పడే వారికి సరికొత్త చికిత్సా పద్ధతుల ద్వారా మెరుగైన జీవితాన్ని అందించేలా తమ అథ్యయన ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిజమెత్ బ్రాడ్‌బురీ తెలిపారు. -
అనారోగ్యంతో గ్రామసేవకుని మృతి
మిడుతూరు(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా మిడుతూరు మండలం కడమూరు గ్రామంలో గ్రామ సేవకునిగా పనిచేస్తున్న సాంబశివుడు(55) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. సాంబశివుడు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.